- సిద్ధగురు రమణానంద మహర్షి
యాదాద్రి, వెలుగు-: షిర్డీ సాయిబాబా పక్కా బ్రాహ్మణుడని, ముస్లిం కాదని సిద్ధగురు రమణానంద మహర్షి అన్నారు. శివుడికి సమానమైన దేవుడు లేరని, సాయిబాబాను మించిన గురువు లేరని, వీరిద్దరూ సమ ఉజ్జీలేనని అభిప్రాయపడ్డారు. సోమవారం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని రమణేశ్వర ఆశ్రమంలో తాను రచించిన ‘శత ప్రశ్న శరసంధానం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు పీఠాధిపతులు షిర్డీ సాయిపై విమర్శలు చేయడం అపచారమని అన్నారు. అలాంటి వ్యాఖ్యల వెనుక కుట్రపూరిత వ్యూహాలు ఉన్నాయని ఆరోపించారు. తాను చర్చకు రావాలని పలుమార్లు పిలిచినా ఎవరూ స్పందించలేదని, ఇప్పటికైనా ముందుకు రావాలని కోరారు. సనాతన ధర్మం తర్వాతే ఇతర మతాలు పుట్టాయని పేర్కొంటూ, మతపరమైన సహనం అవసరమన్నారు.
సనాతన ధర్మం పేరుతో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ‘శివుని ప్రతిరూపమైన షిర్డీ సాయిబాబా దేవుడు కాకపోతే ఇంకెవరు?’ అని ప్రశ్నించారు. సాయిబాబా జీవితం, బోధనలపై వస్తున్న విమర్శలకు సమాధానంగా ‘శత ప్రశ్న శరసంధానం’ గ్రంథాన్ని 11 భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి షిర్డీ సాయి దేవాలయాల నిర్వాహకులు, ట్రస్టు సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
