వరద ముప్పు కట్టడికి కరకట్టలే శరణ్యం..

వరద ముప్పు కట్టడికి  కరకట్టలే శరణ్యం..
  • ఏటా మునుగుతున్న గోదావరి పరివాహక గ్రామాలు
  • 40 కిలోమీటర్ల పొడవున నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలు
  • రూ.70 కోట్లతో అంచనాలు... సర్కారు నిర్ణయంపై ఆశలు

నిర్మల్, వెలుగు: ప్రతి ఏటా వర్షాకాలంలో గోదావరి పరివాహక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. రోజులపాటు జలదిగ్బంధంలో ఉంటున్నాయి. కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నా.. మరికొందరు గ్రామాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏటా మాకు ఏమిటీ ఈ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఏండ్ల నుంచి గోదావరి పరివాహక గ్రామాలను వరద ముప్పు వెంటాడుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అన్ని రకాల ప్రత్యామ్నాయాలను పరిశీలించి కరకట్టలు నిర్మిస్తేనే ముప్పు తప్పుతుందని నిర్ధారించారు. మూడేండ్ల క్రితమే పకడ్బందీ ప్రతిపాదనలు రూపొందించి అప్పటి బీఆర్​ఎస్​ సర్కార్​కు నివేదించారు.

కార్యరూపం దాల్చని కరకట్టలు

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్ల దిగువ నుంచి మొదలయ్యే గోదావరి నది ఖానాపూర్ వరకు ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఎగువ మహారాష్ట్ర నుంచి లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో ప్రాజెక్టు గేట్లు పైకెత్తి దిగువ గోదావరికి నీటిని విడుదల చేస్తున్నారు. ఒకేసారి లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో గోదావరి నది ఉప్పొంగుతుంటుంది. దీంతో నదికి ఇరువైపులా ఉన్న గ్రామాలన్నీ ముంపునకు గురవుతున్నాయి. అకస్మాత్తుగా వస్తున్న వరదలతో మత్స్యకారులు, పశువుల చిక్కుకుపోతున్నారు. ఈ వరద ముప్పు నుంచి కాపాడేందుకు అధికారులు భద్రాచలం తరహాలో కరకట్టల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కానీ కార్యరూపం దాల్చలేదు.

40 కిలోమీటర్ల పొడవుతో..

సోన్ నుంచి ప్రారంభమయ్యే గోదావరి నది ఖానాపూర్ వరకు దాదాపు 40 కి లోమీటర్ల పొడవుతో ప్రవహిస్తుంటుంది. ఈ 40 కిలోమీటర్ల పొడవును పరిగణనలోకి తీసుకున్న అధికారులు నదికి ఇరువైపులా కరకట్టలు నిర్మించాలని అప్పట్లోనే భావించారు. ఇందుకు దాదాపు రూ.70 కోట్ల వరకు ఖర్చవుతుందని మూడేండ్ల క్రితం అంచనా వేశారు. ప్రస్తుతం వరదల నేపథ్యంలో భద్రాచలంలో నిర్మించిన కరకట్టల తరహాలో మరింత శాస్త్రీయతను జోడించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణలోకి తీసుకొని నిర్మించాలని భావిస్తున్నారు. 

పెరిగిన నిర్మాణ వ్యయం కారణంగా నాటి అంచనా కన్నా ఇప్పుడు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. వరద ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ముంపు బాధితులు కోరుతున్నారు. కరకట్టల నిర్మాణ ప్రతిపాదనలను అప్పటి బీఆర్ఎస్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీసం కాంగ్రెస్​ప్రభుత్వమైన నిర్మించాలని వేడుకుంటున్నారు.

20 గ్రామాలకు వరద ముప్పు

గోదావరి ఉధృతి కారణంగా ఏటా నది పరివాహకంలోని దాదాపు 20 గ్రామాలు ప్రత్యక్షంగా ముంపుకు గురవుతుండగా.. మరికొన్ని గ్రామాలు పరోక్షంగా ప్రభావితమవుతున్నాయి. సోన్ నుంచి మొదలుకొని కూచన్ పల్లి, ధర్మారం, పార్ పల్లి, మునిపల్లి, చింతల్ చందా, మామడ మండలంలోని కమల్ కోట, పొన్కల్, ఖానాపూర్​తోపాటు  మండలంలోని సుర్జాపూర్, మేడమ్ పల్లి, బాదన్ కుర్తి గ్రామాలు ఏటా ముంపు బారిన పడుతున్నాయి. గోదావరికి  ఉప నది అయిన స్వర్ణా నది పరివాహకంలోని ప్రాజెక్టు నుంచి మాదాపూర్ వరకు గల గ్రామాలు, నిర్మల్ పట్టణంలోని బీఎన్ఆర్ కాలనీ కూడా ముంపునకు గురవుతోంది.