- రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
- ఎగువన ప్రాణహిత పరవళ్లతో భయం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి నెమ్మదిగా తగ్గుతోంది. 51.60 అడుగుల గరిష్ట నీటిమట్టానికి చేరుకున్న వరద క్రమంగా తగ్గుతూ బుధవారం తెల్లవారుజామున 3.51 గంటలకు 47.9 అడుగులకు చేరుకుంది. దీంతో కలెక్టర్ జితేష్ కుమార్ వి పాటిల్ రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు 45.2 అడుగులకు పడిపోయింది.
దిగువన శబరి, కిన్నెరసాని, ఎగువన తాలిపేరు ఉపనదులు కూడా స్లోగా తగ్గుతున్నాయి. కానీ, ఎగువన ప్రాణహిత పరవళ్లు తొక్కుతుండటంతో ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద మళ్లీ వరద పెరుగుతోంది. దీంతో తిరిగి భద్రాచలం వద్ద వరద పెరుగుతుందనే భయం తీర ప్రాంత పల్లెలను వణికిస్తోంది. ప్రస్తుతానికి భద్రాచలం ఏజెన్సీలో రాకపోకలు కొనసాగుతున్నాయి.
భద్రాచలం టౌన్‌లోని కూనవరం రోడ్డులో మట్టికట్టను తొలగించడంతో కూనవరం వైపు రాకపోకలు ప్రారంభమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో ముసురుపట్టి ఉండడంతో గోదావరి తిరిగి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ, ప్రమాదం ఏమీ ఉండదని చెబుతున్నారు.
