
ఎగువన మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రవాహం పెరిగింది. నిర్మల్ జిల్లాలోని బాసర దగ్గర గోదావరి పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. నది ఒడ్డున ఉన్న శివలింగాలను వరద తాకుతోంది. ఎస్ఆర్ఎస్పీ వైపు గోదావరి పరుగులు తీస్తోంది. గోదావరి నదిలో నీటి ఉధృతి పెరగడంతో వేదభారతి పీఠం విద్యార్థులు నిత్య హారతి పుష్కర ఘాట్ దగ్గర శాంతి పూజలు చేశారు.
సీఎస్ కు సీఎం ఆదేశాలు
గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని, అధికారులను సన్నద్ధంగా ఉంచాలని సీఎస్ సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందుకు సంబంధించి, తక్షణమే సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎస్ కు సీఎం సూచించారు.