
- మరో రెండు, మూడ్రోజుల్లో సీఓటీ మీటింగ్
- కాంట్రాక్టర్ ఎంపిక కూడా..
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్తాగునీటి కోసం చేపట్టే గోదావరి రెండోదశ పనులకు త్వరలో ముహుర్తం ఖరారు కానుంది. దీనికి సంబంధించి వచ్చిన టెండర్ల పరిశీలన పూర్తయినట్టు అధికారులు తెలిపారు. త్వరలోనే కమిటీ ఆఫ్టెండర్స్(సీఓటీ) సమావేశం జరగనుంది. ఇందులో బోర్డు అధికారులతో పాటు ఇరిగేషన్, పబ్లిక్హెల్త్కు సంబంధించిన ఉన్నతాధికారుల కమిటీ పరిశీలన జరిపి కాంట్రాక్టర్ను ఎంపిక చేయనున్నారు.
ఇది పూర్తయితే ప్రాజెక్టు పనులు మొదలవుతాయి. అలాగే వచ్చేనెల రెండో వారంలోగా గోదావరి రెండోదశ పనులకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గోదావరి ఎల్లంపల్లి నుంచి రోజుకు160 ఎంజీడీలను తరలిస్తున్న వాటర్బోర్డు.. రెండో దశ ప్రాజెక్టును మల్లన్న సాగర్వద్ద నిర్మించనుంది. దాదాపు 5,500 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీలను నగరానికి తరలించనుంది.
ఇందులో 15 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, మరో 5 టీఎంసీలు మూసీ ప్రక్షాళన కోసం జంటజలాశయాల్లో నిల్వ ఉంచలా ప్రాజెక్టును రూపొందించారు. ఇది పూర్తయితే నగరానికి అదనంగా మరో 170 ఎంజీడీలను అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జంటజలాశయాలు, కృష్ణా ప్రాజెక్టు –1, 2, 3, ప్రాజెక్టు, గోదావరి మొదటి దశ, సింగూరు, మంజీరా నుంచి రోజుకు 550 ఎంజీడీలను సరఫరా చేస్తున్నారు.