- 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం సన్నాహాలు
- కుంభమేళాలో ఏర్పాట్లు చేసిన ఈవై కన్సల్టెన్సీకి బాధ్యతలు
- నిజామాబాద్ నుంచి భద్రాచలం వరకు 70 ఘాట్లు గుర్తింపు
- సౌలతుల కల్పనకు రూ.50 కోట్లు అవుతాయని అంచనా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2027 జులైలో జరిగే గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈవై(ఎర్నెస్ట్ యంగ్) కన్సల్టెన్సీకి ప్లానింగ్ బాధ్యతలు అప్పగించింది.
కుంభమేళా ఏర్పాట్లలో అనుభవం ఉన్న ఈ సంస్థ.. రాష్ట్రంలో గోదావరి నది ప్రవహించే ప్రతి ప్రాంతాన్ని పరిశీలించి నివేదిక రెడీ చేస్తున్నది. నిజామాబాద్‌లోని కందకుర్తి మొదలు భద్రాచలం వరకు భక్తుల రద్దీ, ఘాట్ల విస్తరణ, మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
దేవాదాయ శాఖ స్పెషల్ ఫోకస్..
దేవాదాయ, టూరిజం, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి మహా కుంభమేళాలో అనుసరించిన విధానాలను అధ్యయనం చేశారు. పుష్కరాల్లో పుణ్యస్నానాలకు రాష్ట్రవ్యాప్తంగా నదీ తీరం వెంబడి ఉన్న పుష్కర ఘాట్లను ఆధునీకరించడంతో పాటు కొత్తవి నిర్మించాలని నిర్ణయించారు. అలాగే, ఆయా ఆలయాల ప్రాంతాల్లో భక్తుల తాకిడికి తగ్గట్లు సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ పనులకు రూ.50 కోట్ల నిధులు అవసరమని దేవాదాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇప్పటికే పనుల గుర్తింపు, ఇతర అంశాలకు సంబంధించి దాదాపు రూ.50 లక్షలు సర్కార్ మంజూరు చేసింది.
మూడు కేటగిరీలుగా విభజన..
రాష్ట్రంలో గోదావరి తీరం వెంబడి మొత్తం ఎన్ని ఘాట్లు ఉన్నాయో ఈవై సంస్థ గుర్తించింది. పుష్కర ఘాట్ల వద్ద డ్రెసింగ్ రూమ్స్, బాత్‌రూమ్స్, తాగు నీరు ఇతర సౌలతుల ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించనుంది. ఇందుకు నిధులెన్ని అవసరమో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. తెలంగాణలో గోదావరి తీరం వెంబడి బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలు ఉండగా.. ఆయా చోట్ల 70 ఘాట్లు ఉన్నట్టు ఈవై సంస్థ గుర్తించింది. వీటిని 3 కేటగిరీలుగా విభజించి పనులు చేపట్టనున్నారు.
గోదావరి పుష్కర ఘాట్, దాని సమీపంలో ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రాంతాలను కేటగిరీ-1గా.. ఘాట్లకు ఆలయాలు కాస్త దూరంగా ఉన్న ప్రాంతాలు కేటగిరీ 2లో, కేవలం స్నానాలకు అనుకూలంగా ఉండే ఘాట్లు ఉన్న ప్రాంతాలను కేటగిరీ 3గా విభజించారు. ప్రస్తుతం గుర్తించిన ఘాట్ల పరిధిలో 65 ఆలయాలు ఉన్నట్లు తేల్చారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వచ్చే ప్రపోజల్స్ మేరకు ఘాట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎండోమెంట్ అధికారులు చెబుతున్నారు.
15 కోట్ల మంది వస్తారని అంచనా..
పుష్కరమంటే పన్నెండేండ్లు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు.. ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. 2027లో బృహస్పతి సింహ రాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. ఇవి 2027 జులై 23న మొదలై ఆగస్టు 3 వరకు 12 రోజుల పాటు కొనసాగను న్నాయి. 2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు దాదాపు 5 కోట్ల మంది భక్తులు వచ్చారు. ఈసారి ఆ సంఖ్య మూడింతలు పెరిగి, 15 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. అందుకు తగినట్లుగా ఈవై కన్సల్టెన్సీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
