పోలవరం నీటి లెక్కలపై గందరగోళం.. గోదావరి ట్రిబ్యునల్కు అడుగులు

పోలవరం నీటి లెక్కలపై గందరగోళం.. గోదావరి ట్రిబ్యునల్కు అడుగులు
  • పోలవరం నీటి లభ్యత, జీబీ లింక్​ వివాదాలపై ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు
  • అవసరం లేకున్నా ఇయ్యాల రెండు రాష్ట్రాలతో సీడబ్ల్యూసీ మీటింగ్​
  • జీబీ లింక్​పై సమగ్రమైన నీటి లభ్యత డేటాతో ముందుకు వెళ్తున్న ఏపీ
  • ఇప్పటిదాకా సైంటిఫిక్​ డేటాను తీయని మన అధికారులు
  • మిగులు జలాలు, ఏటా పోతున్న వరదపై లెక్కలు తీయడంలో మౌనం

హైదరాబాద్, వెలుగు: గోదావరి ట్రిబ్యునల్​ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. సోమవారం తెలంగాణ, ఏపీతో కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పోలవరం వద్ద నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ స్టడీ చేయడం, ఏపీ దానికి అభ్యంతరాలు తెలపడంతో రెండు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ఈ వ్యవహారం ఏపీ, సీడబ్ల్యూసీ మధ్యే ఉన్నా.. తెలంగాణను మీటింగ్​కు పిలవడంలో సీడబ్ల్యూసీ ఉద్దేశమేంటన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ఇష్యూను.. జీబీ లింక్​ ప్రాజెక్ట్​కు ముడిపెట్టి ఆ వ్యవహారాన్ని మరింత వివాదం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వివాదాలను తేల్చేందుకు దానిని సాకుగా చూపించి గోదావరి ట్రిబ్యునల్​ ఏర్పాటు చేసి సాగదీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

సైంటిఫిక్​ లెక్కలేవీ..

జీబీ లింక్​పై ఏపీ శరవేగంగా అడుగులు ముందుకు వేస్తున్నా.. తెలంగాణ కేవలం లేఖలతోనే సరిపెడుతున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ గత 50 ఏండ్ల వరద, మిగులు జలాల లెక్కలను ఏడాదివారీగా వెల్లడించి మరీ ప్రాజెక్టును ముంగటేసుకున్నది. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వాడుకుంటామని చెబుతున్నది. కానీ, ఇప్పటివరకు మన హైడ్రాలజీ డిపార్ట్​మెంట్​ గోదావరిలో ఉన్న వరద లభ్యతపై సైంటిఫిక్​ డేటాను తీయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరిలో రెండు రాష్ట్రాలకు కలిపి నికర జలాల వాటా 1,484 టీఎంసీలుకాగా.. పరీవాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 516 టీఎంసీలను కేటాయించారు. అయితే, మిగులు జలాల వాటాలకు సంబంధించి ఇప్పటివరకు లెక్కలు తేల్చలేదు.

ఆ లెక్కలు తేలకుండా.. ఇటు కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టులకు లింక్​ చేయడం అక్రమమని మన అధికారులు గట్టిగానే వాదిస్తున్నారు. మనకు ఇటు గోదావరి మిగులు జలాల్లో, అటు కృష్ణా జలాల్లో ఎలా నష్టం జరుగుతుందన్న దానిపై శాస్త్రీయంగా లెక్కలను తీయడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఏడాది ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి? మన నుంచి దిగువకు ఎంత నీళ్లు వెళ్తున్నాయి? అన్న దానిపైనా సైంటిఫిక్​ డేటాను ముందే సిద్ధం చేసి పెట్టుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రస్తుతం అత్యంత కీలకమైన హైడ్రాలజీ విభాగంలోనూ అధికారుల కొరత వేధిస్తుండడంతో.. దానిపై అడుగులు ముందుకు పడడం లేదని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ట్రిబ్యునల్​ వస్తే కష్టమేనా..

ఇలాంటి గందరగోళ పరిస్థితుల నేపథ్యంలోనే కేంద్రం గోదావరి ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేసేందుకు అనువుగా మార్చుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే ట్రిబ్యునల్​ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పినా.. తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నది. సందర్భం కోసం వేచి చూస్తున్న కేంద్రం.. ఇప్పుడు జీబీ లింక్​ను అందుకు పావుగా మార్చుకోవాలని యోచిస్తున్నదని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఇప్పుడు అవసరమే లేకున్నా సీడబ్ల్యూసీ మీటింగ్​ పేరిట.. ఓ అడుగు ముందుకు వేస్తున్నదని చెబుతున్నారు. కేంద్రంలో ఉన్నది ఎలాగూ ఏపీ సర్కారు కూటమి ప్రభుత్వమే కాబట్టి.. ఏపీకి మార్గం సుగమమైపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ట్రిబ్యునల్​లో కేసు నడుస్తుండగానే.. జీబీ లింక్​ను దొంగ దారిలో చేపట్టొచ్చనే యోచనలో ఏపీ సర్కారు ట్రిబ్యునల్​కు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువున్నాయని చెబుతున్నారు.

 ట్రిబ్యునల్​ ఏర్పడితే.. పది ఇరవై ఏండ్లయినా ఈ కేసు ఎటూ తెగదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మరికొందరు అధికారులు మాత్రం ట్రిబ్యునల్​ ఏర్పాటు చేస్తే నష్టమెలా ఉంటుందన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అన్ని టెక్నికల్, సైంటిఫిక్​ డేటాతో ట్రిబ్యునల్​ ముందు వాదిస్తే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తన్నారు. అయితే, ఇటు కృష్ణా ట్రిబ్యునల్​లో వాదనలు కొలిక్కి వస్తుండడం.. ఈ ఏడాది చివరి నాటికి తీర్పు మనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండడంతో ఏపీ.. ఇప్పుడు ఈ గోదావరి ట్రిబ్యునల్​ ముచ్చటను ముందటేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మరోవైపు కృష్ణా ట్రిబ్యునల్​లో చేరిన కొందరు సీడబ్ల్యూసీ మాజీ అధికారులు కూడా.. తమ పదవుల కోసం గోదావరి ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేయించేలా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో పనిచేశారు కాబట్టి.. వారు ఎంత చెబితే అంతేనన్న భావనలో వాళ్లున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పోలవరం నీటి లెక్కలపై గందరగోళం..

పోలవరం వద్ద నీటి లభ్యతపై కొంత గందరగోళం ఏర్పడింది. 2023లో హైడ్రాలజీ స్టడీ చేసిన సీడబ్ల్యూసీ.. అక్కడ 496 టీఎంసీల లభ్యత ఉన్నట్టు తేల్చింది. అందులో ఏపీకి 449.78 టీఎంసీలు పోలవరానికి సరిపోతాయని పేర్కొంది. ఆ వివరాలను ఆ ఏడాది జూన్​లో జీఆర్​ఎంబీకి పంపింది. ఆ తర్వాతి నెలలోనే పోలవరం వద్ద నీటి లభ్యతపై రెండు రాష్ట్రాలకూ జీఆర్​ఎంబీ రిపోర్టును పంపించింది. అయితే, సీడబ్ల్యూసీ లెక్కలపై ఏపీ అభ్యంతరం తెలిపింది. అసలు గోదావరి నీటి కేటాయింపులే తెలంగాణకు ఎక్కువ కేటాయించారని ఆరోపించింది. ఏపీకే ఎక్కువ వాటా రావాలని, 770 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నది. పోలవరం వద్ద అవసరాలు పోనూ మిగులు జలాలతోనే జీబీ లింక్​ ప్రాజెక్టును చేపడుతున్నామంటున్న ఏపీ.. సీడబ్ల్యూసీ లెక్కలు తప్పు అని ఆరోపిస్తున్నది.