
కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఉధృతి ఇలాగే కంటిన్యూ అయితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. పుష్కర ఘాట్లు, చిరు దుకాణాలు నీట మునిగిపోయాయి. కాళేశ్వరం వద్ద ప్రస్తుతం 15.800 మీటర్ల ఎత్తులో గోదావరి నీటి మట్టం ఉంది. 2013లో జూలై - అగస్థులో 14.5 మీటర్ల ఎత్తులో ప్రవహించగా 1985లో 15.0 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహించిదని అధికారులు చెబుతున్నారు. గోదావరి వరద నీరు లక్ష్మీ బ్యారేజీ లోకి భారీగా చేరుకొంటోంది. రికార్డ్ స్థాయిలో ఇన్ఫో ఉందని, మొత్తంగా బ్యారేజీ నిండు కుండలా ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.
2019 నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 16.71 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. 85కు గాను 85 గేట్లను ఎత్తి నీటిని వదిలారు. ఇన్ ప్లో 22,15,760 క్యూసెక్కులుండగా... అవుట్ ఫ్లో 22,15,760 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు సరస్వతి బ్యారేజ్ కు కూడా వరద నీరు పోటెత్తుతోంది. దీని నీటి సామర్ధ్యం 10.87 టీఎంసీలు ఉంటే ప్రస్తుత నీటి సామర్ధ్యం 8.38 టీఎంసీలుగా ఉంది. ఇన్ ప్లో 14,77,975 క్యూసెక్కులుగా ఉందని.. అవుట్ ఫ్లో 14,77,975 క్యూసెక్కులుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. సరస్వతి బ్యారేజ్ 14,77,975 క్యూసెక్కులు దిగువకు నీటిని వదిలారు. 66 గేట్లకు గాను 66 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు.