
కాశేశ్వర ప్రాజెక్టు కళ సాకారం దిశగా అడుగులు వేస్తోంది. గోదావరి నుంచి రివర్స్ పంపింగ్ ప్రారంభం కావడంతో అన్నారం బ్యారేజీకి నీళ్లు చేరుతున్నాయి. ఇప్పటివరకు 2.5 టీఎంసీల నీళ్లు చేరగా.. 23.5 కిలోమీటర్ల దూరం బ్యాక్ వాటర్ చేరింది. దీంతో అన్నారం పంప్‌హౌజ్ నిండి.. మోటార్లు ప్రారంభించేందుకు మరో పది రోజులు పట్టనున్నట్లు తెలుస్తోంది. జూన్ 21న సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీతో పాటు కన్నెపల్లి వద్ద మోటార్లను ప్రారంభించారు. గోదావరి నీటిమట్టం ఆధారంగా.. అధికారులు నాలుగు మోటార్ల ద్వారా ప్రతిరోజు నీటి పంపింగ్ చేపడుతున్నారు. నీళ్లు వృథాగా పోకుండా మేడిగడ్డ బ్యారేజీ వద్ద 85 గేట్లు మూసి వేయడంతో నీటిమట్టం పెరిగి..3.6 టీఎంసీల నీళ్లు నిల్వ అయ్యాయి. కన్నెపల్లి వైపు బ్యాక్ వాటర్ మరింత పెరుగుతోంది.
ప్రాణహితకు తగ్గిన ఇన్‌ఫ్లో
మహారాష్ట్ర వర్షాలకు ప్రాణహిత నదికి నిన్నమొన్నటి వరకు రోజుకు 12 వేల క్యూసెక్కుల నీళ్లు రాగా ప్రస్తుతం 11 వేల క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో తగ్గింది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోకి 9 వేలకు పైగా క్యూసెక్కుల వరద వెళ్తుండగా మోటార్లతో పంపింగ్ చేస్తున్నారు. 2 వేల క్యూసెక్కుల వరద నీరు మేడిగడ్డ బ్యారేజీ వైపు వెళ్తోంది. ఈ బ్యారేజీ మొత్తం కెపాసిటీ 16.7 టీఎంసీలు కాగా గేట్లు వేయడంతో 6.6 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం 3.6 టీఎంసీ ల నీరు చేరిందని, దీంతో 17 కిలోమీటర్ల దూరం వరకు బ్యాక్ వాటర్ వెళ్లాయని నీటిపారుదల శాఖ డీఈ సురేశ్ తెలిపారు. మరో 2 కి.మీ దూరం వెల్తే కన్నెపల్లి పంపు హౌస్ కు రీచ్ అవుతాయని, అపుడు ప్రతి రోజు నీటిని పంపింగ్ చేసుకోవచ్చన్నారు. కన్నెపల్లి పంపు హౌస్ ఫోర్ బే వద్ద 95 మీటర్ల నీటిమట్టం స్థిరంగా ఉంటుందున్నారు. ఇలా ఉంటే ఒకేసారి 11 మోటార్లను రన్ చేయొచ్చని, రోజుకు 2 టీఎంసీల నీళ్లను పంపింగ్ చేయొచ్చని చెప్పారు.
4 మోటార్ల ద్వారా రివర్స్ పంపింగ్
రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద మొత్తం 11 మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. సీఎం కేసీఆర్ జూన్ 21న ప్రాజెక్ట్‌ను ప్రారంభించే సమయానికి 9 మోటార్లను మాత్రమే రెడీ చేశారు. ఇందులో అప్పుడున్న నీటిమట్టం ఆధారంగా 6 వ మోటార్‌ను సీఎం ప్రారంభించారు. ఆ తర్వాత 1, 3, 4 వ మోటార్లను అధికారులు రన్ చేశారు. గోదావరి నదికి వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా గ్రావిటీ కెనాల్లోకి పంపింగ్ చేస్తున్నారు. 24 గంటల్లో ఒక మోటార్ 2,300 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తోంది. 4 మోటార్లు నాన్ స్టాప్ గా పనిచేసిన రోజు 9,200 క్యూసెక్కుల నీరు అన్నారం బ్యారేజీకి పంపింగ్ అవుతోంది.
అన్నారం బ్యారేజీ లో 2.5 టీఎంసీల నీరు
ప్రాజెక్ట్ ప్రారంభం సమయంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చుక్క నీరు లేదు. దీంతో ఈ రెండు చోట్ల మోటార్లు ప్రారంభించకుండానే బ్యారేజీలను ప్రారంభించారు. అన్నారం బ్యారేజీ కెపాసిటీ 11.5 టీఎంసీలు కాగా ఇప్పటివరకు కన్నెపల్లి నుంచి జరిగిన రివర్స్ పంపింగ్‌తో శుక్రవారం నాటికి 2.5 టీఎంసీల నీరు చేరింది. బ్యారేజీ వద్ద 7.3 మీటర్ల ఎత్తువరకు నీటి నిల్వ ఉంది. మంథని మండలం శివ్వారం గ్రామం వరకు సుమారు 23.5 కిలోమీటర్ల వరకు బ్యాక్ వాటర్ వెళ్లాయి. పంప్‌హౌజ్‌కు చేరుకునేందుకు మరో 12.5 కిలోమీటర్ల దూరం నీళ్లు వెళ్లాల్సి ఉందని నీటిపారుదల శాఖ ఏఈ యాకయ్య చెప్పారు. ఈ బ్యాక్ వాటర్ పంప్‌హౌజ్‌కు చేరుకుంటే తప్ప ఇక్కడ మోటార్లు ప్రారంభించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అన్నారం పంప్‌హౌజ్ వద్ద మోటార్లను ప్రారంభించాలంటే కనీసం 10 నుంచి 15 రోజుల సమయం పట్టేలా ఉందని అధికారులు చెబుతున్నారు. అన్నారం నుంచి సుందిళ్లకు.. సుందిళ్ల నిండిన తర్వాత అక్కడి నుంచి ఎల్లంపల్లికి రివర్స్ పంపింగ్ చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ఆయకట్టు పంట పొలాలకు కాళేశ్వరం నీళ్లు అందనున్నాయి.