
పెద్దపల్లి, వెలుగు:అన్నారం బ్యారేజీ నుంచి సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని పంప్ చేయడం కోసం ఇంజినీర్లు రెండు రోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. శనివారం సాయంత్రం ఒకటో మోటార్ రన్ చేసి సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోశారు. అయితే శనివారం ఉదయం నుంచి పంప్‌హౌస్‌లోకి మీడియాను అనుమతించకపోవడంతో అసలు అక్కడేమీ జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. అన్నారం పంప్‌హౌస్‌లో మొదటి రెండు మోటార్లు టెక్నికల్ ప్రాబ్లమ్‌తో రన్ కావడం లేదని మధ్యాహ్నం వరకు వార్తలు వెలువడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గోదావరిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీల కట్టారు. మేడిగడ్డ బ్యారేజీలో ఏడు టీఎంసీల నీటిని నిల్వ చేసి కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి వద్ద నిర్మించిన పంప్‌హౌస్ ద్వారా అన్నారం బ్యారేజీకి తరలించారు.
అన్నారం బ్యారేజీలో నీటి నిల్వ 5.63 టీఎంసీలకు చేరడంతో బ్యాక్ వాటర్ పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని కాసిపేట వరకు చేరింది. అక్కడ కట్టిన అన్నారం పంప్‌హౌస్ నుంచి సుందిళ్ల బ్యారేజీలోకి ఎత్తిపోసేందుకు ఇరిగేషన్ ఆఫీసర్లు, కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు మూడు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నారం పంప్‌హౌస్‌లో మొత్తం ఎనిమిది మోటార్లు ఉన్నాయి. ఇందులో మొదటి మోటార్ వెట్ రన్ శుక్రవారం నిర్వహించాల్సి ఉండగా టెక్నికల్ ప్రాబ్లమ్‌తో రన్ చేయలేదు. మోటార్ ఆర్పీఎం తీసుకోకపోవటంతో అర్ధరాత్రి వరకు శ్రమించినా వెట్ రన్ సాధ్యం కాలేదు. మరుసటి రోజుకు వాయిదా పడింది. మొదటి మోటార్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్‌తో రెండో మోటర్ వెట్ రన్ చేసి అన్నారం నీటిని సుందిళ్ల బ్యారేజీలోకి పంప్ చేయాలని ఇంజినీర్లు అనుకున్నరు. అయితే రెండో మోటార్ కూడా ఆన్ చేసిన తరువాత టైమ్‌కు సరైన ఆర్పీఎంకు చేరుకోక పోవడంతో ఇంజనీర్లు ఇబ్బంది పడ్డారు. ఎంతకూ సెట్ కాకపోవడంతో మూడో మోటార్ రెడీ చేసి వెట్‌రన్ చేయాలనుకున్నరు. చివరకు ఆస్ట్రియా ఇంజినీర్లు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. శనివారం మధ్యాహ్నం 3గంటల 45నిముషాలకు అన్నారం పంస్‌హౌస్‌లోని మొదటి మోటార్ వెట్‌రన్ సక్సెస్ అయింది. దాదాపు గంట సేపు మోటార్ రన్ చేశారు. అన్నారం బ్యారేజీ నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించారు.