గోఫస్ట్​ బిజినెస్ ప్లాన్​కు ఆమోదం.. రూ.424 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు ఓకే

గోఫస్ట్​ బిజినెస్ ప్లాన్​కు ఆమోదం.. రూ.424 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు ఓకే

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఎయిర్​లైన్​ కంపెనీ గోఫస్ట్  పునరుద్ధరణ కోసం తయారు చేసిన బిజినెస్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను లెండర్లు ఆమోదించారు.  ఇందులో భాగంగా గో ఫస్ట్ రిజల్యూషన్ ప్రొఫెషనల్ రూ. 425 కోట్ల మధ్యంతర ఆర్థిక సహాయం కోరగా, లెండర్లు ఒప్పుకున్నారు. అయితే సంబంధిత బ్యాంకుల బోర్డులు ఈ ప్లాన్​ను ఆమోదించాల్సి ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకుల కన్సార్టియం ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌కు భారీగా అప్పులు ఇచ్చింది. మధ్యంతర ఆర్థికసాయం మంజూరు చేసేందుకు ఇవి బోర్డు అనుమతులు కోరనున్నాయి. గోఫస్ట్​ తన విమానయాన సంస్థ కార్యకలాపాలను ప్రారంభించడానికి డీజీసీఏ అనుమతులు పొందాలి.

ఈ క్యారియర్ ప్రస్తుత ఏడాది నవంబర్ వరకు దాని బిజినెస్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను లెండర్లకు వివరించింది. మిలిటరీ చార్టర్ విమానాలతో బిజినెస్​ను తిరిగి మొదలుపెడతామని, దాని తర్వాత వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని భావిస్తున్నట్లు పేర్కొంది.  ఆర్థిక ఇబ్బందుల కారణంగా క్యారియర్ మే 3న విమానాలను నిలిపివేసింది.  రిజల్యూషన్ ప్రొఫెషనల్  శైలేంద్ర అజ్మీరా రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి  అకౌంటబుల్​ మేనేజర్‌‌‌‌‌‌‌‌గా ప్రస్తుత సీఈఓ కౌశిక్ ఖోనాను నామినేట్ చేశారు. దివాలా కోసం గత నెలలో దరఖాస్తు​ దాఖలు చేసిన ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్,  బిజినెస్​ను మళ్లీ ప్రారంభించడానికి రూ. 400 కోట్లు అవసరమని తెలిపింది.  ప్రభుత్వ అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం నిధులతో పాటు అన్‌‌‌‌‌‌‌‌డ్రాన్​ క్రెడిట్‌‌‌‌‌‌‌‌ తన దగ్గర ఉందని రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌కు వెల్లడించింది.

ఏప్రిల్, మే నెలల జీతాలు చెల్లించడానికి,  వెండర్లకు బిల్లులు చెల్లించడానికి ఈ నిధులను వాడుతుంది. క్యాష్ అండ్ క్యారీ మోడ్‌‌‌‌‌‌‌‌లో రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి రూ. 12 కోట్లు అవసరమని ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ పేర్కొంది.  కోర్టుకు అందించిన డాక్యుమెంట్ల ప్రకారం గో ఫస్ట్‌‌‌‌‌‌‌‌కు దాదాపు రూ.11,400 కోట్లు బకాయిలు ఉన్నాయి, అందులో రూ.6,520 కోట్లు కన్సార్టియానికి చెల్లించాల్సి ఉంది. కొందరు రాజీనామాలు చేసినప్పటికీ, తమ వద్ద 340 మంది పైలట్లు,  680 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 530 మంది ఇంజనీర్లు ఉన్నారని పేర్కొంది. 22 విమానాలను నడపడానికి వీళ్లు సరిపోతారని ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ తెలిపింది.