
దిస్పూర్: కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ డిప్యూటీ ప్రతిపక్ష నేత గౌరవ్ గొగొయ్‌పై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ఆహ్వానం మేరకే గౌవర్ ఆయన పాకిస్తాన్‌కు వెళ్లారని సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు. ఐఎస్ఐ దగ్గర ట్రైనింగ్ కోసమే అక్కడికి వెళ్లాడని.. ఇందుకు సంబంధించిన సమాచారం మా వద్ద ఉందన్నారు. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కాదని.. పాకిస్తాన్ హోం శాఖ ఆహ్వానం మేరకే ఆయన పాక్ సందర్శించారని ఆరోపించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని.. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారని అన్నారు.
లోక్‌సభలో గౌరవ్ గొగోయ్‌ను డిప్యూటీ ప్రతిపక్ష నేత పదవి నుంచి తొలగించాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్, ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష ఎంపీల బృందాలను ఏర్పాటు చేసింది. మొత్తం 7 టీములను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందాలు వివిధ దేశాల్లో పర్యటించి పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్, ఆపరేషన్ సింధూర్ గురించి వివరించి.. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాక్‌పై ఒత్తిడి తీసుకురానున్నారు. ఈ అఖిల పక్ష బృందం కోసం కాంగ్రెస్ తమ పార్టీ నుంచి నలుగురు ఎంపీల పేర్లను కేంద్రానికి పంపింది.
ఇందులో గౌరవ్ గొగొయ్ పేరు కూడా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం గౌరవ్ గొగొయ్ పేరును పక్కన పెట్టింది. గతంలో గౌరవ్ గొగొయ్ పాక్ లో పర్యటించినట్లు ఆరోపణలు ఉండటంతో అతడిని పరిగణలోకి తీసుకోలేదు. దీనిపైన స్పందించిన సీఎం హిమాంత.. పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని వివరించడానికి విదేశాలకు పంపే ప్రతినిధుల బృందాల కోసం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన నలుగురు ఎంపీల జాబితా నుంచి గౌరవ్ గొగోయ్‌ను తొలగించాలని రాహుల్ గాంధీని కోరాడు. జాతీయ భద్రత దృష్ట్యా అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో అతడిని చేర్చరాదని అన్నాడు. భారత ప్రతినిధి బృందంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఎంపీలు ఉండటం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు.