బోనమెత్తిన భాగ్యనగరం..వైభవంగా గోల్కొండ బోనాలు ప్రారంభం

బోనమెత్తిన భాగ్యనగరం..వైభవంగా గోల్కొండ బోనాలు ప్రారంభం

రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి  తొలి బోనం సమర్పణతో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి.  ఉదయం జగదాంబిక, మహంకాళి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో సుమారు 500 కు పైగా బోనాలు ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. బోనాల ఉత్సవాలతో గోల్కొండ కోటలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పోతరాజులు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శివసత్తుల పూనకాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఈ బోనాల వేడుకల్లో భారీ ఎత్తున ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. 

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి పూజకు మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌  హాజరయ్యారు. జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు బోర్డు వారికి పట్టువస్ర్తాలను, బంగారు బోనం,లంగర్‌హౌస్‌ చౌరస్తాలో  మంత్రులు అందచేశారు. అనంతరం బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. 


గోల్కొండ మహంకాళి, జగదాంబింకా  అమ్మవార్ల  బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.  గోల్కొండ బోనాల తర్వాత సికింద్రాబాద్, లాల్ దర్వాజ్ హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయన్నారు.
తెలంగాణ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన  ఢిల్లీ లో బోనాలు ఉత్సవాలు జరిగాయన్నారు. 

గోల్కొండ బోనాల ప్రారంభంతో హైదరాబాద్ పట్టణంలో బోనాల పండుగ మొదలైందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.  జగదాంబిక  మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు నిర్వహించుకునే ఈ బోనాల పండగకు సీఎం కేసీఆర్ రూ. 15 కోట్లు పంపిణీ చేశారన్నారు. అందరూ సహకరించి బోనాల పండగను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.