ఘట్కేసర్, వెలుగు: కూతురు పెండ్లి కోసం తెచ్చిన బంగారం, నగదు చోరీకి గురైంది. ఘట్కేసర్ సీఐ బాలస్వామి తెలిపిన ప్రకారం.. ఎదులాబాద్ డివిజన్ అవుశాపూర్‌కు చెందిన కేతావత్ శంకర్ లక్ష్మి దంపతుల పెద్ద కూతురు నాగర్‌కర్నూల్ జిల్లా ఉరుకొండ మండలం బాల్యలోక్యా తండాలో ఇటీవల సర్పంచ్‌గా నామినేషన్ వేసింది. దీంతో వారం క్రితం కుటుంబ సభ్యులంతా ప్రచారం కోసం అక్కడికి వెళ్లారు.
పెద్ద కూతురుకు ఎన్నికల సమయంలో డబ్బులు అవసరం పడడంతో ఈ నెల 6న తల్లి లక్ష్మి.. అల్లుడిని వెంటబెట్టుకుని అవుశాపూర్‌కు వెళ్లి రూ.లక్ష తీసుకొని వచ్చింది. గురువారం అర్ధరాత్రి దాటాక ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఇంటి వెనుక నుంచి ప్రహరీ దూకి ఇంట్లోకి వెళ్లారు.
బీరువాలో దాచిన 5 తులాల బంగారం, రూ.2 లక్షల నగదుతో పాటు మరో గదిలో ఉన్న కొన్ని చీరలను చోరీ చేశారు. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి శంకర్ కు సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిన్న కూతురు పెళ్లి కోసం తెచ్చిపెట్టుకున్న నగదు, బంగారం, చీరలు దొంగలు ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయాడు.

