న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్త అమ్మకాల ఒత్తిడితో దేశ రాజధానిలో బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం వెండి కిలోకు రూ.17,800 తగ్గి రూ.2.38 లక్షల వద్ద ముగిసింది. బుధవారం ధర రూ.2.56 లక్షలుగా ఉంది. జనవరి 29న నమోదైన రికార్డు స్థాయి రూ.4.04 లక్షలతో పోలిస్తే వెండి రేటు 41 శాతం క్షీణించింది.
పది గ్రాముల పసిడి ధర రూ.ఏడు వేలు తగ్గి రూ.1.53 లక్షలకు చేరింది. క్రితం ముగింపు రూ.1.60 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడిచమురు ధరలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన నిర్ణయాలు ఇందుకు ప్రధాన కారణాలు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణుడు దిలీప్ పర్మార్ మాట్లాడుతూ బాండ్ల ఆదాయం పెరగడం బంగారం ధరలపై ఒత్తిడి పెంచిందని పేర్కొన్నారు.
విదేశీ మార్కెట్లోనూ స్పాట్ వెండి 6 శాతం పతనమై 70.49 డాలర్లకు చేరగా, బంగారం 3 శాతం తగ్గి 4,678 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చమురు సరఫరాకు ఆటంకం కలిగిస్తాయనే భయాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. దీనివల్ల బులియన్ ధరలు పడుతున్నాయని లెమన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకుడు గౌరవ్ గార్గ్ తెలిపారు.
