పెళ్లి ఇంట్లో 40 తులాల బంగారం చోరీ

పెళ్లి ఇంట్లో 40 తులాల బంగారం చోరీ

చుట్టాల పెళ్లికి వెళ్లిన వారికి ఊహించని షాక్ తగిలింది. 40 తులాల బంగారాన్ని పోగొట్టుకున్నారు. ఈ సంఘటన ఆదివారం అనంతపురం జిల్లాలో జరిగింది. కడపజిల్లాకు చెందిన కరుదున్‌, మాబున్నీషా, రెహనా, పర్వీన్‌, ఆయేషా కుటుంబ సభ్యులు గుంతకల్‌లోని తమ బంధువుల పెళ్లికి హాజరై శనివారం రాత్రి విడిది గదిలో బంగారాన్ని సూట్‌కేసులో భద్రపరిచి నిద్రపోయారు. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు సూట్‌కేసు మాయం చేశారని, ఇందులో 40 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని, దీని విలువ రూ.12 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు.  చోరీకి జరిగిన విషయాన్ని వెంటనే టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అక్కడికి వెళ్లిన పోలీసులు విచారణ చేపట్టారు. పెళ్లి కోసం లాంగ్ చైన్స్, నెక్లేస్ లు వేసుకున్నామని..పెళ్లి అయిపోయాక అందరి నగలు సూట్ కేసులో పెట్టామని తెలిపారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగల ఆచూకి కోసం వెతుకుతున్నామని తెలిపారు. బంగారం పోవడంతో సందడిగా ఉండాల్సిన పెళ్లి ఇల్లు విషాదంతో మునిగిపోయింది. దగ్గరి చుట్టాలను కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఎదురయ్యిందంటూ కన్నీరుమున్నీరవుతున్నారు బాధితులు.