దిగొస్తున్న బంగారం.. రెండు రోజుల్లో రూ.9 వేలు డౌన్.. హైదరాబాద్‌‌లో తులం ఎంతంటే..

దిగొస్తున్న బంగారం.. రెండు రోజుల్లో రూ.9 వేలు డౌన్.. హైదరాబాద్‌‌లో తులం ఎంతంటే..

24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,25,250
కిలో వెండి ధర రూ.1,58,000
రాబోయే రోజుల్లో మరింత తగ్గే చాన్స్ ఉందన్న ఎక్స్‌‌ పర్ట్స్​

హైదరాబాద్, వెలుగు: బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలు.. మంగళ, బుధవారాల్లో (అక్టోబర్ 21,22) భారీగా పడిపోయాయి. రెండు రోజుల్లోనే బంగారం ధర ఏకంగా రూ.9 వేలు డౌన్ అయింది. అటు వెండి ధర కూడా తగ్గింది. బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,250, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,14,843కి చేరింది. అలాగే, వెండి ధర దాదాపు రూ.8 వేల వరకు తగ్గింది. 

బుధవారం కేజీ వెండి ధర రూ.1,58,000 పలికింది. వారం రోజుల్లో దాదాపు రూ.28 వేల వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌‌లో ఔన్సు బంగారం ధర 4,022 డాలర్లకు పడిపోయింది. వెండి 47.84 డాలర్లకు చేరింది. ఇటీవల రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి లోహాల్లో మదుపర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టడం గోల్డ్, సిల్వర్ రేట్ల తగ్గుదలకు కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, 2013 తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పడిపోవడం ఇప్పుడేనని అంటున్నారు.

మరింత తగ్గే చాన్స్.. 

ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌‌లో మంగళవారంతో పోలిస్తే బుధవారం రేట్లు తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 4,022 డాలర్లకు దిగొచ్చింది. సిల్వర్ రేటు 47.84 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌‌‌‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ.88.29 వద్ద కొనసాగుతున్నది. అయితే, గోల్డ్, సిల్వర్ రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. 

స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు దీనికి దోహదం చేస్తాయి. అయితే, బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? లేదా మళ్లీ పెరుగుతాయా? అనే దానిపై ఇప్పుడే క్లారిటీ రాదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే, గతంతో పోలిస్తే ధరలు ఇంకా తగ్గొచ్చని చెబుతుండటంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తగ్గుతున్న ధరలు వ్యాపారులకు కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ధరల హెచ్చుతగ్గులతో ఆందోళన..

కొంతకాలంగా బంగారం, వెండి ధరల్లో నిలకడ లోపించింది. ఒక రోజు ధరల పెరిగితే.. మరో రోజు తగ్గుతున్నాయి. ధరల హెచ్చుతగ్గులతో వినియోగదారులు, వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది బంగారం, వెండి కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి. ఒకవేళ ఇప్పుడే కొంటే మున్ముందు ఇంకా తగ్గుతుందేమోనని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొనకపోతే భవిష్యత్‌‌లో మళ్లీ పెరిగితే ఎలా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.