
- రూ. 7,400 పెరిగిన వెండి ధర
న్యూఢిల్లీ:
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోళ్లు బాగా పెరగడంతో సోమవారం ఒక్కరోజే 10 గ్రాముల పసిడి ధర రూ. 2,700 పెరిగి రూ. 1,23,300 మార్కును అధిగమించింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ప్రకారం.. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,700 జంప్ చేసి రూ. 1,23,300 వద్ద కొత్త రికార్డును నమోదు చేసింది.
శుక్రవారం ముగింపు ధర రూ. 1,20,600 ఉంది. 99.5 శాతం స్వచ్ఛత గల పుత్తడి రేటు కూడా రూ. 2,700 పెరిగి రూ. 1,22,700 వద్దకు చేరుకుంది. వెండి ధరలూ భారీగా పెరిగాయి. కిలో ధర రూ. 7,400 పెరిగి, రూ. 1,57,400 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. శుక్రవారం వెండి ధర రూ. 1.50 లక్షలు ఉంది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో వెండి ధర ఏకంగా 75.47 శాతం పెరిగింది. 2024 డిసెంబర్ 31న కిలో వెండి ధర రూ. 89,700 వద్ద ఉంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన సౌమిల్ గాంధీ ఈ విషయమై మాట్లాడుతూ, ఈ రికార్డు ధరల వద్ద కూడా పెట్టుబడిదారులు బులియన్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.
సానుకూల ఫండమెంటల్స్, బలమైన బుల్లిష్ మూమెంటంతో పసిడి ధరలు మరింత పెరగవచ్చని అంచనా వేశారు. అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ కావడంతో ఆర్థిక పనితీరుపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు సేఫ్ హెవెన్ అయిన బంగారానికి డిమాండ్‌ను పెంచుతున్నాయని గాంధీ వివరించారు.
అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర దాదాపు 2 శాతం పెరిగి, ఔన్స్‌కు (28.3 గ్రాములు) రికార్డు స్థాయిలో 3,949.58 డాలర్లను తాకింది. వెండి ధర ఒకశాతానికిపైగా పెరిగి ఔన్స్‌కు 48.75 డాలర్ల వద్ద గరిష్టాన్ని చేరుకుంది. అమెరికాలో షట్‌డౌన్ ఆరో రోజుకు చేరింది. ఈ పరిస్థితుల్లో స్పాట్ గోల్డ్ ధర 3,940 డాలర్ల మార్కును అధిగమించినట్లు కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన కైనత్ చైన్వాలా తెలిపారు. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 1.66 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,20,075 వద్ద రికార్డు హైకి చేరింది. వెండి ఫ్యూచర్స్ కూడా 1.53 శాతం (రూ. 2,233) పెరిగి కిలోకు రూ. 1,47,977 వద్ద రికార్డు స్థాయికి వెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఔన్స్‌కు 3,900 డాలర్లకు చేరడం, దేశీయంగా పండుగల డిమాండ్, రూపాయి విలువ తగ్గుదలతో బంగారం ధరలు దూసుకెళ్లాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ జతీన్ త్రివేది అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ సంవత్సరం బంగారం ధరలు 50 శాతం, వెండి ధర 65 శాతం పెరిగాయని ఆగ్మౌంట్కు చెందిన రేనీషా చైనానీ తెలిపారు.