జెట్ స్పీడ్ తో గోల్డ్ లోన్ మార్కెట్..122 శాతం జంప్

జెట్ స్పీడ్ తో గోల్డ్ లోన్ మార్కెట్..122 శాతం జంప్
  • రూ. 2.94 లక్షల కోట్ల విలువైన లోన్ల జారీ
  • గతేడాది లోన్ల విలువ రూ. 1.32 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: బంగారం లోన్ల మార్కెట్ జెట్​స్పీడ్​తో దూసుకెళ్తోంది. బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు భారీ ఎత్తున లోన్లు ఇస్తున్నాయి. ఈ ఏడాది జులై 25 నాటికి రూ. 2.94 లక్షల కోట్ల విలువైన లోన్లు జారీ చేశాయి. అంతకుముందు సంవత్సరం లోన్ల విలువ రూ. 1.32 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 122 శాతం ఎక్కువ. పర్సనల్​ లోన్​ విభాగంలో పెరుగుదల అత్యంత వేగంగా ఉంది. బంగారం ధరలు పెరగడం, రూల్స్​ సులభతరం కావడం, త్వరగా మంజూరు కావడం ఈ పెరుగుదలకు కారణాలు. సోమవారం 24-క్యా​రెట్​ బంగారం ధర సుమారు 10 గ్రాముల ధర రూ.1,19,500కు చేరింది. 

అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో భారీ డిమాండ్​వల్ల ధరలు పెరిగాయి.  ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్​ బ్యాంకులు  రిస్క్​ డైవర్సిఫికేషన్​ వ్యూహంలో భాగంగా బంగారాన్ని భారీగా కొంటున్నాయని ముత్తూట్​ ఫిన్​కార్ప్​ లిమిటెడ్​ సీఈఓ షాజీ వర్గీస్​అన్నారు.  మనదేశంలో బంగారం లోన్లకు డిమాండ్​ ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. దీనికి అనేక అంశాలు కారణం. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరగడం ముఖ్య కారణం. ఇది బంగారం ధరలను పెంచి పెట్టుబడికి ఆకర్షణీయంగా మార్చింది. ఇతర లోన్లతో పోలిస్తే బంగారం లోన్లపై వడ్డీ తక్కువ. 

గతంలో చివరి ప్రయత్నంగానే మాత్రమే బంగారం లోన్లు తీసుకునేవాళ్లు. ఇప్పుడు చిన్న అవసరం వచ్చినా పసిడిని కుదవబెట్టడానికి వెనకాడటం లేదు. పెళ్లి, వ్యాపారం, విద్యకు డబ్బులు సమకూర్చడానికి బంగారం లోన్లను ఉపయోగిస్తున్నారు.  పుత్తడి విలువలో 85 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు.   

బంగారం లోన్లతో లాభనష్టాలు

 వేగవంతమైన ప్రాసెసింగ్​,  సులభంగా తిరిగి చెల్లించగలడం, సిబిల్​స్కోర్​అవసరం లేకపోవడం.. గోల్డ్​లోన్లకు ఉన్న ఆకర్షణలు.   సకాలంలో అప్పు కట్టకుంటే,  తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చు.  బంగారం ధరలు తగ్గితే,  మరింత బంగారం తాకట్టు పెట్టాల్సి రావొచ్చు. తక్కువ క్రెడిట్​ స్కోర్ ఉంటే ఎక్కువ వడ్డీ వసూలు చేసే అవకాశం ఉంది. వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్​ ఫీజు, వాల్యుయేషన్ ఛార్జీలు, లేట్​పేమెంట్​చార్జీలు ఉంటాయి.