Gold Price : పండగొచ్చినా తగ్గని బంగారం ధరలు

Gold Price : పండగొచ్చినా తగ్గని బంగారం ధరలు

పండగలు, శుభకార్యాలు వస్తున్నాయంటే చాలు మహిళలు బంగారం షాపుల వద్ద క్యూ కట్టేస్తారు. అయితే.. కొద్ది రోజులుగా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గకపోగా పెరుగుతూ పోతున్నాయి. రెండు నెలలుగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలోనే ట్రేడవుతున్నాయి. చివరగా దసరా, దీపావళి పండగ సమయంలో బంగారం, వెండి ధరలు చాలా తక్కువలో ఉన్నాయి. అక్కడి నుంచి ఎక్కడా తగ్గకుండా పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో బంగారం ధర రెండేళ్ల గరిష్టాన్ని కూడా తాకింది. ఇప్పుడు సంక్రాంతి పండగకు ముందు గోల్డ్ కొనాలనుకునే వారికి కూడా రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా తాజాగా మరోసారి ధరలు పుంజుకున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1900 డాలర్లకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు చూస్తే 23.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే రూపాయి మాత్రం గణనీయంగా పుంజుకుంటోంది. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ.81.148కు చేరింది.

దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,290కి చేరింది. గతేడాది ఆగస్టు నెలలో రూ.56,191 ఉన్న బంగారం ధర ఆ రికార్డును అధిగమించింది. ఇక 2022 నవంబర్ నుండి బంగారం ధరలు పుంజుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. అయితే హైదరాబాద్‌తో పోలిస్తే ఇక్కడ ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.100 పెరిగి రూ.51,550కి చేరుకుంది. ఇదే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి.. ప్రస్తుతం రూ.56,220 వద్ద కొనసాగుతోంది.

రేట్లు పెరుగుతున్న క్రమంలోనే దేశంలో బంగారానికి గిరాకీ పడిపోయింది. పసిడి దిగుమతులే దీనిని స్పష్టం చేస్తున్నాయి. భారత్‌లోకి పసిడి దిగుమతులు గత నెల డిసెంబరులో 79 శాతం తగ్గాయి. ఇక గతేడాది మొత్తంగా చూసుకుంటే పసిడి దిగుమతులు 706 టన్నులు. 2021లో ఈ సంఖ్య 1068 టన్నులుగా ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడం, దేశీయంగా డిమాండ్ తగ్గడం వల్లే పసిడి దిగుమతులు కూడా తగ్గాయి.