
వెలుగు: వరుసగా రెండో వారం కూడా బంగారం ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో ఈ వారం కూడా 10 గ్రాముల బంగారం ధర రూ.600 మేర తగ్గి రూ.33,170 వద్ద క్లోజైంది. అంతర్జా తీయంగా బలహీనమైన ట్రెండ్ , స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ అంతగా లేకపోవడం బంగారం ధరలకు దెబ్బ కొడుతోంది. వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉండటంతో పాటు, దిగుమతి చేసుకునే బంగారం చౌకగా దొరుకుతుండటంతో దేశీయంగా బంగారం ధరలు దిగొస్తున్నట్టు ట్రేడర్లు చెప్పారు. ఈక్విటీ మార్కెట్ వైపుకి నిధులు తరలిస్తుండటంతో, స్థానిక జువెల్లర్స్ , రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గుతోందని తెలిపారు.
గ్లోబల్ గా బంగారం ధర ఒక ఔన్స్ కు 1,298.70 డాలర్ల వద్ద, వెం డి ధర ఔన్స్ కు 15.31 డాలర్ల వద్ద ముగిసింది. దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ఈ వారం రూ.33,450 నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత రూ.33,070 వద్ద కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. అయితే గ్లోబల్ మార్కెట్‌లో గత కొన్ని వారాలుగా నమోదువుతున్న కనిష్ట స్థాయిల నుంచి రికవరీ కావడంతో దేశీయంగా కూడా కొంతమేర రికవరీ అయింది. చివరికి ఈ వారం రూ.600 తగ్గి రూ.33,170 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 33వేల వద్ద క్లోజైంది.