రూటు మార్చిన స్మగ్లర్లు..బస్సులు, రైళ్లల్లో బంగారం రవాణా

రూటు మార్చిన స్మగ్లర్లు..బస్సులు, రైళ్లల్లో బంగారం రవాణా

3 రోజుల్లో 31.5 కిలోల గోల్డ్​ సీజ్

విలువ రూ.13.3 కోట్లు

నాలుగు ముఠాల్లోని 13 మంది అరెస్ట్​ చేసిన డీఆర్​ఐ

సికింద్రాబాద్​, నెల్లూరు, విజయవాడ రైల్వేస్టేషన్లలో పట్టివేత

బెజవాడ కనకదుర్గ వారధి బస్టాప్​ వద్ద కూడా..

అందరి వెనక వరంగల్  మాస్టర్​మైండ్స్​ 

గోల్డ్​ స్మగ్లర్లు రూట్​ మార్చారు. ఇప్పటిదాకా కొత్త టెక్నిక్​లతో విమానాల్లో బంగారం స్మగ్లింగ్​ చేసిన కొరియర్లు.. ఇప్పుడు రైళ్లు, బస్సులకు మారారు. అయినా అడ్డంగా దొరికిపోయారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 31.5 కిలోల బంగారాన్ని తరలిస్తూ బుక్కయ్యారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​(డీఆర్​ఐ) అధికారులు రైళ్లు, బస్సుల్లో చేసిన తనిఖీల్లో కొరియర్లు పట్టుబడ్డారు. చెన్నై నుంచి విజయవాడ మీదుగా వరంగల్​, హైదరాబాద్​కు బంగారం తరలిస్తున్న నాలుగు ముఠాలకు చెందిన 13 మంది ఆట కట్టించిన అధికారులు, వారిని అరెస్ట్​ చేసి రూ.13.3 కోట్ల విలువైన గోల్డ్​ సీజ్​ చేశారు. వివరాలను డీఆర్​ఐ హైదరాబాద్​ జోన్​ అడిషనల్​ డీజీ ఆదివారం వెల్లడించారు.

స్మగ్లింగ్​ కోసం స్పెషల్​ బట్టలు

స్మగ్లింగ్​ కోసం స్మగ్లర్లు కొత్త కొత్త టెక్నిక్​లను ఎంచుకుంటున్నారు. ఆదివారం దొరికిపోయిన కొరియర్లు, స్మగ్లింగ్​ కోసం స్పెషల్​గా తయారు చేసిన బట్టలు వేసుకున్నారు. వాటిలోనే గోల్డ్​ పెట్టి తరలించే ప్రయత్నం చేశారు. బంగారం తరలిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్​ స్టేషన్​కు చేరుకున్న డీఆర్​ఐ అధికారులు చెన్నై–హైదరాబాద్​ సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​లో తనిఖీలు చేశారు. అనుమానంగా కనిపించిన వ్యక్తులను సోదా చేశారు.  స్పెషల్​గా వేసుకున్న బట్టల్లో బంగారం పెట్టి తీసుకెళుతున్నట్టు గుర్తించారు. రూ.4.53 కోట్లు విలువ చేసే 10.709 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్​కు అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు కొరియర్లు, ట్రాన్స్​పోర్టర్ల వ్యవస్థతో గోల్డ్​ స్మగ్లింగ్​ చేస్తున్నట్టు తేల్చారు. ఇక, శుక్రవారం చెన్నై నుంచి బయల్దేరిన జైపూర్​ సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​ రైల్లో నెల్లూరు డీఆర్​ఐ అధికారులు తనిఖీలు చేశారు. ప్రత్యేక ప్యాకెట్లలో పెట్టిన బంగారాన్ని లగేజీ బ్యాగ్​లో పెట్టుకుని వరంగల్​కు తరలిస్తుండగా ముగ్గురిని అరెస్ట్​ చేశారు. రూ.3.6 కోట్ల విలువైన 7.228 కిలోల గోల్డ్​ స్వాధీనం చేసుకున్నారు. శనివారం విజయవాడ రైల్వే స్టేషన్​లో జీటీ ఎక్స్​ప్రెస్​ రైల్లో అక్కడి డీఆర్​ఐ అధికారులు తనిఖీ చేశారు. లో దుస్తుల్లో బంగారం తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్​ చేశారు. రూ.2.99 కోట్ల విలువైన 7.077 కిలోల గోల్డ్​ను సీజ్​ చేశారు. గోల్డ్​ వరంగల్​కు తరలిస్తున్నట్టు తేల్చారు.

బస్సులోనూ.. 

ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో బస్సులో గోల్డ్​ను తరలించే ప్రయత్నం చేసిన ముఠా ఆట కట్టించారు విజయవాడ డీఆర్​ఐ అధికారులు. కనకదుర్గ వారధి బస్​స్టాప్​ వద్ద నలుగురిని అరెస్ట్​ చేశారు. చెన్నై నుంచి కావలికి రైల్లో వచ్చిన నలుగురు, అక్కడి నుంచి ఒంగోలు, గుంటూరు మీదుగా ఆర్టీసీ బస్సుల్లో వరంగల్​కు బంగారం తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు.. విజయవాడలో ఆటకట్టించారు. లో దుస్తుల్లో పెట్టుకుని స్మగ్లింగ్​ చేస్తున్న రూ.2.74 కోట్ల విలువైన గోల్డ్​ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అన్ని ముఠాల వెనక వరంగల్​లోనే మాస్టర్​మైండ్స్​ ఉన్నట్టు చెప్పారు.