భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం మూలవరులు స్వర్ణ కవచాలతో భక్తులకు దర్శనం ఇచ్చారు. సుప్రభాత సేవ అనంతరం మూలవరులను బంగారు కవచాలతో అలంకరించారు. విశేషహారతులను సమర్పించారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. లక్ష్మీ అష్టోత్తరశతనామార్చన చేసి కుంకుమార్చన, విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహించారు.
కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం చేశారు. భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. కార్తీకమాసం ముగింపు సందర్భంగా పొలి పాడ్యమి స్నానం ఆచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో గోదావరి పుణ్యస్నానాలు చేశారు. రామయ్యను దర్శించుకున్నారు. పూజలు చేశారు. సాయంత్రం దర్బారు సేవ చేసి సీతారామయ్యకు సంధ్యాహారతిని అందజేశారు.
ఏపీలోని భీమవరానికి చెందిన నాగవేంకట సుబ్బాసురేశ్ వర్మ, సౌమ్య దంపతులు790 గ్రాముల వెండితో తయారు చేసిన కుంభహారతి, వైజాగ్‌కు చెందిన సాయి అఖిల్, కృష్ణ ప్రియ దంపతులు కిలో 470 గ్రాముల వెండితో చేసిన ద్వాదశహారతి, తాడేపల్లిగూడెంకు చెందిన పృథ్వీరాజు, శారద స్వప్న దంపతులు కిలో 15 గ్రాముల వెండితో చేయించిన వెండి ద్వయహారతి వస్తువులను ఈవో దామోదర్‌రావు చేతుల మీదుగా సీతారామచంద్రస్వామికి విరాళంగా ఇచ్చారు. వీటి విలువ రూ.4.50లక్షలు ఉంటుందని భక్తులు తెలిపారు.
