అమెరికాకు రక్షణ కవచం.. స్పేస్లో రూ.17 లక్షల కోట్లతో ‘గోల్డెన్ డోమ్’.. రష్యా, చైనా ఆందోళన

 అమెరికాకు రక్షణ కవచం.. స్పేస్లో రూ.17 లక్షల కోట్లతో ‘గోల్డెన్ డోమ్’.. రష్యా, చైనా ఆందోళన

ప్రపంచం అంతా యుద్ధ వాతావరణంలో ఉంది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్.. మరోవైపు ఇజ్రాయెల్-గాజా దేశాల మధ్య యుద్ధాలు.. దీనికి తోడు ఇటీవల భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడు యుద్ధాలు వస్తాయో.. ఏ దేశంపై ఎవరు దండెత్తుతారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో అమెరికా అత్యాధునిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. భవిష్యత్తుల్లో యుద్ధాలనుంచి కాపాడుకునేందుకు.. మిస్సైల్స్, డ్రోన్స్ ను తిప్పికొట్టేందుకు అమెరికాకు రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. 

అమెరికాకు 17 లక్షల కోట్ల రూపాయలతో (175 బిలియన్ డాలర్లు) ‘గోల్డెన్ డోమ్’ను నిర్మిస్తున్నట్లు మంగళవారం (మే 20)  ట్రంప్ ప్రకటించారు. రక్షణ వ్యవస్థ కోసం అంతరిక్షంలో (స్పేస్) ఆయుధాన్ని మోహరించే తొలి దేశంగా అమెరికా నిలుస్తుంది. ట్రంప్ పదవి పూర్తయ్యే లోపు అంటే మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. 

ఈ డిఫెన్స్ సిస్టమ్ కు సంబంధించి ప్లానింగ్ పూర్తయ్యిందని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు గురించి ట్రంప్ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే.. అంటే జనవరి 2025 ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ట్రంప్ చెప్పారు. 

గోల్డెన్ డోమ్ అంటే ఏమిటి.. ఎలా పనిచేస్తుంది..:

గోల్డెన్ డోమ్ అనేది అత్యాధునిక రక్షణ వ్యవస్థ. భూమిపైనే కాకుండా అంతరిక్షం (స్పేస్) లో ఏర్పాటు చేసిన షీల్డ్ (కవచం). మిస్సైల్స్, డ్రోన్స్ ను గుర్తించి వెంటనే టార్గెట్ చేసి కూల్చేసే సామర్థ్యం ఉంటుంది. అవి భూమిని చేరకముందే గాలిలోనే.. ఆకాశంలోనే కూల్చేస్తుంది ఈ డోమ్ డిఫెన్స్ సిస్టం. 

ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది.175 బిలియన్ డాలర్లతో నిర్మించనున్నారు. వచ్చే తరాలకు.. నూతన టెక్నాలజీతో అమెరికాను కాపాడుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ట్రంప్ చెప్పారు. మొత్తం 500 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. ప్రాజెక్టు ప్రారంభం కోసం 25 బిలియన్ డాలర్లను ముందుగా కేటాయించనున్నారు. 

తీవ్రంగా వ్యతిరేకించిన చైనా, రష్యా:

గోల్డెన్ డోమ్ నిర్మాణంపై ఇప్పటికే చైనా, రష్యా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా నిర్ణయం అంతరిక్షాన్ని కూడా రణరంగంగా మార్చేలా ఉందని మండిపడ్డాయి. స్పేస్ లో యుద్ధ విన్యాసాల వలన రానున్న రోజుల్లో చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉందని.. దేశాల మధ్య పోటీతో అన్ని దేశాలు ఇలా నిర్మించుకుంటూ పోతే.. చివరికి ప్రపంచ వినాశనానికి దారితీసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాయి.