నాగార్జున సాగర్ లో ప్రముఖుల సందడి

నాగార్జున సాగర్  లో ప్రముఖుల సందడి

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ లో రెండు రోజులుగా ప్రముఖుల సందడి నెలకొంది. నాగార్జునసాగర్ ఆంధ్ర ప్రాంతంలోని ఏపీఆర్ జేసీలో శని, ఆదివారాల్లో కళాశాల స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ కాలేజీలో చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారందరూ స్వర్ణోత్సవాలకు హాజరు కావడంతో నాగార్జునసాగర్ లో ఉన్నత స్థాయి అధికారుల సందడి నెలకొంది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తుకారాంజి, రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి బుద్ధవనాన్ని తన క్లాస్మేట్స్ తో కలిసి సందర్శించారు.

 వీరికి బుద్ధవనం అధికారులు శాసన, రవిచంద్ర ఇక్కడి విశేషాలను తెలియజేశారు.  బుద్ధవనం కండువాలతో, బ్రోచర్లతో సత్కరించారు. వీరితోపాటు నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ నారాయణ అమిత్, జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేశ్ కుమార్, పెద్దవూర రెవెన్యూ ప్రోటోకాల్ ఆర్ఐ దండా శ్రీనివాస్ రెడ్డి, విజయ విహార్ మేనేజర్ కిరణ్ తదితరులు ఉన్నారు.