రేవల్లి/ఏదుల, వెలుగు : ఏదుల మండలంలోని గొల్లపల్లి–-చీర్కపల్లి ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. మా భూములు మాకు కావాలి.. రిజర్వాయర్ వద్దంటూ అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో రైతుల చేపట్టిన నిరసన దీక్ష మంగళవారం 8వ రోజుకు చేరింది. ఈ దీక్షా శిబిరాన్ని రేవల్లి మాజీ జడ్పీటీసీ బోర్ల భీమయ్య, సర్పంచ్ శివరాం రెడ్డి సందర్శించి రైతులకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏదుల రిజర్వాయర్ వల్ల రైతులు భారీగా నష్టపోయారని, ఆ పాత గాయాలు మానకముందే మరో ప్రాజెక్టు పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. కొత్త రిజర్వాయర్ నిర్మిస్తే వేలాది ఎకరాల సారవంతమైన సాగుభూమి నీట మునుగుతుందని, తద్వారా వందలాది రైతు కుటుంబాలు రోడ్డునపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తన వైఖరి వీడి వెంటనే ప్రాజెక్టు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గొల్లపల్లి, చీర్కపల్లి గ్రామస్తులతోపాటు రేవల్లి మాజీ ఉపసర్పంచులు వెంకటేశ్, సుధాకర్ రెడ్డి, అబ్బాస్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
