చేప పిల్లల టెండర్ల వెనుక మత్స్యశాఖ అధికారుల హస్తం..?

చేప పిల్లల టెండర్ల వెనుక మత్స్యశాఖ అధికారుల హస్తం..?
  • మత్స్యకారులు వద్దంటున్నా టెండర్లకే ఆఫీసర్ల మొగ్గు
  •     కాంట్రాక్టర్లతో మిలాఖత్‌ అయ్యారని ఆరోపణలు
  •     చేప పిల్లలకు బదులు పైసలిస్తే తామే తెచ్చుకుంటామంటున్న మత్స్యకారులు
  •     14 జిల్లాల్లో ఒకటే టెండర్..11 జిల్లాల్లో దాఖలు కాని బిడ్లు
  •     సరైన బిడ్లు రాకపోవడంతో టెండర్ల గడువు ఈ నెల 12 వరకు పెంపు
  •     రాష్ట్రంలో 26,326 రిజర్వాయర్లలో 84.62 కోట్ల చేప పిల్లలు విడుదలకు నిర్ణయం


హైదరాబాద్, వెలుగు: కొన్నేళ్లుగా చేపపిల్లల సరఫరా టెండర్లు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. క్వాలిటీ లేని, చిన్న సైజు చేప పిల్లలతో పాటు చచ్చిన పిల్లలు పోస్తున్నారని, లెక్కల్లోనూ గోల్‌మాల్‌ చేస్తున్నారని, దీని వల్ల తాము భారీగా నష్టపోతున్నామని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. 

ఈ దఫా నుంచి డైరెక్ట్​బెన్‌ఫిట్‌ స్కీం ద్వారా సొసైటీలకే పైసలిస్తే తామే క్వాలిటీ ఉన్న చేప పిల్లలు కొని, చెరువుల్లో పోసుకుంటామని అధికారులను అభ్యర్థిస్తున్నారు. కానీ మత్స్యశాఖలోని కొందరు అధికారులు.. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఈ సారి కూడా టెండర్లు పిలిచారన్న ఆరోపణలు వస్తున్నాయి. 

తాజాగా సోమవారం 32 జిల్లాలకు సంబంధించిన టెండర్‌ బిడ్లు ఓపెన్‌ చేయగా, 14 జిల్లాల్లో ఒకటే టెండర్‌ రాగా, 11 జిల్లాల్లో అసలు బిడ్లే దాఖలు కాకపోవడాన్ని బట్టి చూస్తే ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. కాంట్రాక్టర్లంతా రింగైనట్లు స్పష్టమవుతున్నా టెండర్ల గడువును ఈ నెల 12 వరకు పొడిగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మత్స్యకారులు వద్దన్నా ఎప్పట్లాగే టెండర్లు.. 

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి, చేపల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్రంలో 6,152 మత్స్యకార సంఘాల పరిధిలో 4.21 లక్షల మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. నిజానికి 2016–-17లో అప్పటి బీఆర్ఎస్‌ సర్కార్‌ ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి బీఆర్ఎస్​లీడర్లు, వారి అనుచరులే ఏపీ కాంట్రాక్టర్లతో మిలాఖత్‌ అయి చేపపిల్లల సరఫరా టెండర్లు దక్కించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

 నిజానికి ఆయా చెరువులు, జలాశయాల సామర్థ్యాన్ని బట్టి చిన్న సైజు (35 నుంచి-40 మి.మీ), పెద్ద సైజు (80 -నుంచి100 మి.మీ) చేప పిల్లలను సప్లై చేయాలి. కానీ ఇప్పటికే ఆయా జిల్లాలపై గుత్తాధిపత్యం చలాయిస్తున్న కాంట్రాక్టర్లంతా రింగై, పోటీ లేకుండా చూసుకొని టెండర్లు దక్కించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. సైజు తక్కువ చేపపిల్లలతో పాటు  చచ్చిన పిల్లలను పోస్తున్నారని, లెక్కల్లోనూ సగానికి సగం గోల్‌మాల్‌ చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

గతంలో చాలాచోట్ల మత్స్యకార సొసైటీలు చేప పిల్లలను లెక్కబెట్టి మరీ కాంట్రాక్టర్ల బండారాన్ని బట్టబయలు చేసిన ఉదంతాలు, చచ్చిన చేపపిల్లలతో ఆందోళనలకు దిగిన ఘటనలు ఉన్నాయి. దీంతో విధిలేక మత్స్యకారులు అప్పలు చేసి మరీ విజయవాడ లాంటి చోట్లకు వెళ్లి చేప పిల్లలు కొని తెచ్చి చెరువుల్లో పోసుకోవడం ఆనవాయితీగా మారింది. కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మత్స్యకార సంఘాల ప్రతినిధులు సంబంధిత అధికారులను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.

 దాదాపు 80 మంది దళారులు కాంట్రాక్టర్లుగా మారి ప్రతి సంవత్సరం నాణ్యత లేని చేప పిల్లలను సరఫరా చేస్తున్నారని, ఈ సారి అలాకాకుండా సొసైటీలకే పైసలిస్తే తామే ఏపీలో చేప పిల్లలు కొని, చెరువుల్లో పోసుకుంటామని వేడుకున్నారు. కానీ మత్స్యకారుల అభ్యర్థనను పక్కనపెట్టి ఈ సారి 26,326 జలాశయాలు, చెరువుల్లో 84.62 కోట్ల చేప పిల్లలు, రొయ్యపిల్లలు పోసేందుకు ఎప్పట్లాగే టెండర్లు పిలిచారు. 

14 జిల్లాల్లో ఒక్కటే టెండర్.. 11జిల్లాల్లో బిడ్లే రాలే..

ఆగస్ట్‌ 18 నుంచి టెండర్‌ బిడ్ల దాఖలు ప్రారంభంకాగా, సెప్టెంబర్‌ 8 వరకు గడువు విధించారు. కానీ బిడ్లు రాలేదన్న కారణంతో మరోసారి ఈ నెల 12 వరకు టెండర్‌ గడువును పొడిగించారు. రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ -ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు నిర్వహిస్తున్నారు. 

కానీ తాజాగా దాఖలైన 40 బిడ్లలో 7 జిల్లాల్లో తప్ప 14 జిల్లాలకు ఒకే బిడ్ దాఖలు కావడం, 11 జిల్లాలకు ఎలాంటి బిడ్లూ రాలేదు. కాంట్రాక్టర్లు మిలాఖత్‌ కావడం, కొత్త వారిని అడ్డుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న రూ.100 కోట్ల బిల్లులు క్లియర్‌ ​కాకపోవడం కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి కారణమనే  వాదనలు వినిపిస్తున్నాయి. 

ప్రభుత్వం డీబీటీ చేయాలి 

రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల పేరుతో కాలయాపన చేయకుండా, చేప పిల్లల కోసం కేటాయించిన రూ.122 కోట్లను వెంటనే మత్స్య సొసైటీల అకౌంట్లలో జమ చేయాలి. నాణ్యమైన చేప పిల్లలను కొని చెరువుల్లో వేసుకునే అవకాశం మత్స్యకారులకే ఇవ్వాలి. అలాగే మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి  బడ్జెట్లో రూ.5 వేల కోట్లు  కేటాయించాలి. 

50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు ప్రతినెలా రూ.5 వేల వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వాలి. మత్స్యకారులు మరణిస్తే ఇన్స్యూరెన్స్, ఎక్స్‌గ్రేషియాలను సులభతరం చేసి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలి.- లెల్లెల బాలకృష్ణ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మత్స్యకారుల సంఘం