నిధులు గోల్​మాల్​ చేసి ఏడాదిన్నర..రికవరీలో ఎందుకింత డిలే?

నిధులు గోల్​మాల్​ చేసి ఏడాదిన్నర..రికవరీలో ఎందుకింత డిలే?
  •        రూ.42 లక్షలకు రూ.12 లక్షలు మాత్రమే వసూలు 
  •       మూడునెలల్లో ముగించాల్సి ఉంటే.. ఇంకా కొనసాగుతున్న ప్రక్రియ
  •       ఇదే విషయమై ఇటీవల మండల సభలో నిలదీత
  •       ఆఫీసర్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న సభ్యులు 

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎరువుల అమ్మకాల్లో గోల్​మాల్​ జరిగి ఏడాదిన్నర అవుతోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని  సొసైటీ సభ్యులు అధికారులపై  అసహనం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల రికవరీపై అధికారులు ఎందుకు డిలే చేస్తున్నారని నిలదీస్తున్నారు.  అక్రమాలకు పాల్పడిన వారిని అధికారులు వెనుకేసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు.

దుబ్బాక పీఎసీఎస్ లో ఏడాదిన్నర కింద రూ.42 లక్షల మేర నిధుల గోల్ మాల్ జరిగితే ఇప్పటి వరకు కేవలం రూ.12 లక్షలు మాత్రమే  రికవరీ చేశారు. ఇటీవల మండల సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని సభ్యులు లేవనెత్తడంతో  మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

జరిగింది ఇదీ .. 

ఎరువుల అమ్మిన డబ్బులను కొందరు సొంతానికి వాడుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల ద్వారా వచ్చిన కమీషన్ డబ్బులను మార్క్ ఫెడ్ కు ఎరువుల ఖాతా కింద కట్టి  అక్రమాలు బయటపడకుండా మ్యానేజ్ చేస్తూ వచ్చారు. అధికారుల  ఆడిట్ సందర్బంగా ధాన్యం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బులు సొసైటీ ఖాతాలో  నిల్వ లేకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయడంతో ఏడాదిన్నర కింద ఈ భాగోతం బయటపడింది.

ఈ విషయంపై అప్పటి డిస్ట్రిక్ కో ఆపరేటివ్ అధికారి విచారణ జరిపించి  ప్రాథమికంగా అక్రమాలు జరిగినట్టు తేల్చారు. బాధ్యుడైన దుబ్బాక పీఎసీఎస్ సీఈవో లక్ష్మారెడ్డిని సస్పెండ్ చేశారు. విచారణ ప్రారంభమైన తరువాత 12 లక్షలు సొసైటీకి చెల్లించినా మిగతారూ.30 లక్షల రికవరీ పై ఇప్పుడు నీలీ నీడలు కమ్ముకున్నాయి. 

విచారణపై పలు అనుమానాలు.. 

దుబ్బాక సొసైటీలో జరిగిన అక్రమాలపై మూడు నెలల్లో విచారణ జరిపి అసలు వ్యక్తులను గుర్తించి డబ్బులు రికవరీ చేయాల్సి ఉన్నా ఇప్పటికీ నోటీసులు ఇచ్చి వదిలేశారు.  స్టాట్యూటరీ రిపోర్ట్ తరువాత సంబంధిత వ్యక్తుల నుంచి డబ్బుల  రికవరీ కోసం  సర్ ఛార్జి ఆర్డర్ జారీ చేసి జవాబుకు 21 రోజుల గడువును ఇస్తారు. వీరి జవాబులు హేతుబద్ధంగా లేకుంటే ఆర్డర్ పాస్ చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఫైల్ చేసి డబ్బులు రికవరీకి చర్యలు తీసుకోవాలి.

ఇదంతా అవకతవకలు గుర్తించిన మూడు నెలల్లో జరగాల్సిన ప్రక్రియ.. కానీ ఇక్కడ మాత్రం ఏడాదిన్నర కావస్తున్నా ఎలాంటీ చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.  ప్రస్తుతం  సర్ ఛార్జి నోటీసు జారీ చేయగా ఇంకా ఎలాంటీ సమాధానం రానట్టు తెలుస్తోంది. ఏదేమైనా ప్రక్రియను స్పీడప్​ చేసి అవకతవకలు జరిగిన సొసైటీ మొత్తం డబ్బులను త్వరగా రికవరీ చేయాలని పలువురు కోరుతున్నారు. 

త్వరలోనే  పూర్తి స్థాయిలో చర్యలు

దుబ్బాక పీఏసీఎస్​లో అవకతవకలకు సంబంధించి డబ్బుల రికవరీకి త్వరలోనే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించి సర్ ఛార్జి నోటీసును ఇటీవలే జారీ చేయగా వారం రోజుల గడువు కోరారు. వారం రోజుల్లో  సర్ ఛార్జి నోటీసుకు సంబంధించి సరైన సమాధానం ఇవ్వకుంటే అటాచ్​మెంట్ ఆర్డర్స్ ఇచ్చి డబ్బుల రికవరీకి చర్యలు తీసుకుంటాం. 

– కె.కరుణ, ఇన్​చార్జి 
డిస్ట్రిక్ కో ఆపరేటీవ్ ఆఫీసర్