
ప్రతి ఇంట్లో సండే వస్తే నాన్ వెజ్ వండుకోవడం కామన్. చాలా మంది ఎక్కువగా చికెన్ లేదా మటన్ తెచ్చుకుంటారు. కొంతమందికి రొటిన్‌గా చికెన్, మటనే తినడం బోర్ కొడుతుంది. అలాంటి వారు కొత్త రుచి కోసం వెంపర్లాడుతుంటారు. ఏదైనా కొత్త టెస్ట్ చేయాలని తహతహలాడుతుంటారు. చికెన్, మటన్ కాకుండా నెక్ట్స్ నాన్ వెజ్ ప్రియులకు టక్కున గుర్తు వచ్చేది వంటకం పిష్. నాన్ వెజ్‌లో ఎన్ని వంటకాలు ఉన్న చేపల పులుసుకు ఉండే క్రేజ్ వేరే. ఇందుకోసమే ఫిష్ ప్రియుల కోసం ఓ కొత్త వెరైటీ తీసుకొచ్చాం. అదే గోంగూర చేపల పులుసు.
ఒక్కసారి ఈ గోంగూర చేపల పులుసు టెస్ట్ చేస్తే జీవితంలో ఆ రుచి మర్చిపోలేరంటే అతిశయోక్తి కాదు. చేపల పులుసులో కొద్దిగా గోంగూర వేస్తే ఇక ఆ పులుసును ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే.. మరీ అంతటి కమ్మని రుచిగల గోంగూర చేపల పులుసును ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. మీరు కూడా రేపు (2025, ఆగస్ట్ 24 ) మీ ఇంట్లో ఈ గోంగూర చేపల పులుసు ట్రై చేసి రొటిన్ చికెన్, మటనే కాకుండా ఈ ఆదివారం కొత్త రుచిని ఆస్వాదించండి.
Also read:-9టూ5 ఉద్యోగం చేస్తూనే..రోజుకు10 వేల అడుగులు ఇలా వేయొచ్చు
గోంగూర చేపల పులుసు తయారీకి కావాల్సినవి:
- చేప ముక్కలు -అరకిలో
- అల్లం వెల్లుల్లి - ఒక టీ స్పూన్
- ఉప్పు -తగినంత
- పసుపు - కొద్దిగా
- కారం - నాలుగు టేబుల్ స్పూన్లు
- నూనె -సరిపడంతా
- ఆవాలు, జీలకర్ర- ఒక్కోటి ఒక్కో టేబుల్ స్పూన్
- ఎండుమిర్చి రెండు
- ఉల్లిగడ్డ తరుగు -ఒక కప్పు
- ఎర్ర గోంగూర - ఒక కట్ట
- మెంతి పిండి -ఒక టీ స్పూన్
- ధనియాలపొడి - ఒక టీ స్పూన్
- గరం మసాలా - ముప్పావు స్పూన్
- టొమాటో పులుసు -ఒక కప్పు
- నీళ్లు - 350 ఎంఎల్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం: చేప ముక్కలను శుభ్రంగా కడిగి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు ముక్కలకు పట్టించాలి. ఒక కడాయిలో ముప్పావు కప్పు నూనె వేడిచేసి చేప ముక్కలు ఎర్రగా వేగించాలి. అదే కడాయిలో మరికొంచెం నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు మగ్గించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. ఎర్ర గోంగూర వేసి మగ్గించాలి. తరువాత అందులో పసుపు, కారం, ఉప్పు, మెంతిపొడి, ధనియాలపొడి, గరంమసాలా వేసి కలపాలి. కొంచెం ఉడికాక టొమాటో పేస్ట్, నీళ్లుపోసి పులుసు ఉడికించాలి. తర్వాత చేపముక్కలు వేసి 20 నిమిషాలు పులుసులో మగ్గించాలి. చివర్లో కొత్తిమీర వేస్తే గోంగూర చేపల పులుసు రెడీ.