తెలంగాణ నేతలతో భేటీ సంతృప్తినిచ్చింది

తెలంగాణ నేతలతో భేటీ సంతృప్తినిచ్చింది

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసేందుకు ఐక్యంగా పోరాటం చేస్తామని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమైన నాయకుల ఫొటోలను పంచుకున్నారు.  కాగా ఇటీవల జరిగిన సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని ప్రియాంక గాంధీ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ క్రమశిక్షణ, సమన్వయంతో ముందుకు సాగాలని ఆమె దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీలో నిర్వహించిన ఈ సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాలేదు. పార్లమెంట్ కమిటీ మీటింగ్ లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన.. సరిగ్గా ప్రియాంకతో మీటింగ్ సమయానికి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలు, ముఖ్య నేతల మధ్య లోపించిన సఖ్యత, పరస్పర విమర్శలు, పార్టీలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ, మునుగోడు అభ్యర్థి ఎంపిక, ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై  సమావేశంలో చర్చించారు.