త్వరలో బల్దియా నుంచి మధ్యతరగతివారికి గుడ్ న్యూస్

త్వరలో బల్దియా నుంచి మధ్యతరగతివారికి గుడ్ న్యూస్
  • 250 గజాల లోపు ఇండ్లకు నో ట్యాక్స్!
  • మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమైన బల్దియా
  • ఆపై వాటికి ప్రాపర్టీ ట్యాక్సును పెంచేందుకు ప్లాన్
  • బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించే అవకాశం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో 200 నుంచి 250 చదరపు గజాల లోపు ఉన్న నాన్ కమర్షియల్ ఇండ్లకు ప్రాపర్టీ ట్యాక్స్​నుంచి మినహాయింపు ఇచ్చి, అంతకు మించి ఉన్న కమర్షియల్, నాన్ కమర్షియల్ ప్రాపర్టీ దారుల ట్యాక్స్ ను పెంచేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైనట్టు తెలుస్తోంది.  బడ్జెట్ సమావేశాల్లో జీహెచ్ఎంసీ యాక్ట్​లో చట్ట సవరణ చేసి,  దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.  వచ్చే ఆర్థిక ఏడాది నుంచి ఇది అమలు కావొచ్చని బల్దియా సిబ్బంది చెప్తున్నారు. ఇప్పటికే ట్యాక్స్ చెల్లించిన వాళ్లకు దాన్ని  2022-–23 ఆర్థిక సంవత్సరానికి వర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 4 నెలల క్రితమే జీహెచ్ఎంసీ  ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపింది. గ్రేటర్​లో  200 నుంచి 250 చదరపు గజాల లోపు ఉన్న ఆస్తులు 35 శాతం మాత్రమే ఉన్నాయి. ఇందులో సగం మంది ప్రాపర్టీ దారులు ఏడాదికి రూ.101 మాత్రమే చెల్లించే పేద, మధ్య తరగతి ఇండ్ల యజమానులున్నారు.  వీరికి మినహాయింపు ఇస్తే జనాలు అడగక ముందే మరో ఫ్రీ స్కీమ్​ని అమలు చేశామని చెప్పుకునేందుకు కూడా ఉంటుందని ప్రభుత్వం  ఆలోచిస్తోంది. 

బృహన్ ముంబయి కార్పొరేషన్ తరహాలో... 
బృహన్ ముంబయి కార్పొరేషన్​లో ఈ ఏడాది న్యూ ఇయర్ కానుక అంటూ 500 చదరపు గజాల లోపు ఉన్న  ఇండ్లకు ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి అక్కడి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.  ఇదే తరహాలో గ్రేటర్ సిటీలోనూ నాన్ కమర్షియల్ ఇండ్లకు ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సర్కారు ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  ముందుగా 500 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్రాపర్టీ దారులకు ఈ స్కీమ్ ని వర్తింపజేయాలని అనుకున్నప్పటికీ అది వర్కవుట్ కాదని కేవలం 250 లోపు ఉన్న వారికి మాత్రమే వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ముంబయిలో  ట్యాక్స్ నుంచి మినహాయింపు మాత్రమే ఇచ్చారు. కానీ ఇక్కడ బల్దియా  కొందరికి మినహాయింపునిచ్చి.. మిగతా ప్రాపర్టీ దారులకు ట్యాక్స్ పెంచి ఖజానా నింపుకోవాలని
చూస్తున్నట్లు తెలుస్తోంది. 

కొందరికే మేలు..
గ్రేటర్​లో మొత్తం 17 లక్షల మంది  జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు.  ఇందులో మురికివాడల్లో  3 లక్షల మంది రూ.101 పన్ను చెల్లించేవారు ఉండగా, 200 నుంచి గజాల లోపు ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ ఖాతాలు దాదాపుగా రెండున్నర లక్షల నుంచి 3 లక్షల మధ్య ఉన్నాయి. వీరి నుంచి జీహెచ్ఎంసీకి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు  ట్యాక్స్ వస్తుంది. అందరి నుంచి కిందటి ఆర్థిక సంవత్సరంలో  రూ. 1704 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి  రూ.1850 కోట్లకు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అంత మొత్తం వచ్చేలా లేదు.  ఇలా మొత్తం వస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్​ లో 200 నుంచి 250 చదరపు గజాల లోపల ఉన్న వారి నుంచి రూ.250 కోట్లకు తక్కువగానే వస్తోంది. వీరికి  ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చి 250 చదరపు గజాల కంటే ఎక్కువగా ఉన్న అన్ని రకాల ప్రాపర్టీ దారుల  ట్యాక్స్​ పెంచితే ఇంతకు రెట్టింపు ఆదాయమే వస్తుంది. ఈ ఫ్రీ స్కీమ్  6 లక్షల మంది వరకు వర్తించినప్పటికీ బల్దియాకు మాత్రం ఆదాయం తగ్గదు.