ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. టికెట్ ధర ఎంతంటే..

ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. టికెట్ ధర ఎంతంటే..

విదేశీ పర్యటన అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. చాన్స్ దొరికితే ఎవరైనా వెళ్లడానికే మొగ్గుచూపుతారు. కానీ.. వీసా, విమాన చార్జీలు, ప్రయాణ ఖర్చులు ఇవన్నీ భరించలేక చాలామంది ఊహల్లోనే విదేశీ పర్యటన చేస్తుంటారు. అటువంటి వారందరికీ కొంచెం భారం తగ్గే అవకాశం కల్పిస్తోంది ఓ సంస్థ. బస్సులో విదేశాలకు వెళ్లే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది అడ్వెంచర్స్ ఓవర్‌లాండ్ అనే సంస్థ. అది కూడా ఏదో పక్కనే ఉన్న నేపాల్‌కు, మయన్మార్‌కు కాదు.. ఏకంగా లండన్‌కు..! అవును... ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సులో వెళ్లవచ్చు. రూట్ మ్యాప్ ఖరారైతే.. సెప్టెంబరులోనే ఈ ట్రిప్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లాలంటే.. 18 దేశాల మీదుగా వెళ్సాల్సి ఉంటుంది. ఈ ప్రయాణానికి 70 రోజులపాటు సమయం పడుతుంది. ఫుల్లీ ఫెసిలిటీస్ తో ఉండే ఈ బస్సు 18 దేశాల మీదుగా దాదాపు 20వేల కి.మీ.పాటు ప్రయాణిస్తుంది.

ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సు సర్వీసును ప్రజలు ఆస్వాదించే అవకాశం లభించడం ఇది రెండోసారి. వాస్తవానికి 1957లో ఢిల్లీ మీదుగా కోల్‌కతా–లండన్ మధ్య ఒక బ్రిటిష్ కంపెనీ బస్సు సర్వీసును ప్రారంభించింది. కొన్నేళ్ల పాటు ఆ సర్వీసు నడిచిన తర్వాత.. బస్సు ప్రమాదానికి గురవడంతో నిలిపివేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆల్బర్ట్ టూర్స్ అనే కంపెనీ డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. సిడ్నీ–ఇండియా–లండన్ మీదుగా బస్సు సర్వీసును ప్రారంభించారు. ఆ సర్వీసు 1976 వరకు కొనసాగింది. అనంతరం ఇరాన్‌లో అంతర్యుద్ధం, భారత్‌–పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా బస్సు సర్వీసును నిలిపివేశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు బస్సు సర్వీసు ప్రారంభంకానుంది.

ఇండియా మయన్మార్ సరిహద్దులో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో మయన్మార్ మీదుగా ఈ సర్వీసు నడవనుంది. గతంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా లండన్ వెళ్లేవారు. కానీ ఇప్పుడు అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రూట్ మార్చారు. కొత్త మార్గంలో లండన్‌కు బస్సును నడపనున్నారు. ఢిల్లీ నుంచి మయన్మార్‌ మీదుగా లండన్‌కు బస్సును నడుపుతారు. ఢిల్లీ నుంచి బయలుదేరి కోల్‌కతా బస్సులో మయన్మార్ చేరుకుంటారు. అక్కడి నుంచి థాయ్‌లాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్‌, లండన్‌ మీదుగా ప్రయాణిస్తారు. కాగా.. ఈ ప్రయాణానికి ఉపయోగించే బస్సు సకల సౌకర్యాలతో ఉంటుంది.  ఈ బస్సులో  మొత్తం 20 సీట్లు ఉంటాయి. ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక క్యాబిన్ ఉంటుంది. తినడం, తాగడం నుంచి పడుకునే వరకు సకల సౌకర్యాలతో ఆ క్యాబిన్ ఉంటుంది. ఇన్ని సౌకర్యాలతో ప్రత్యేకంగా తయారుచేసిన ఈ బస్సులో ప్రయాణించాలంటే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఒక్కొక్కరికి అక్షరాల రూ.15 లక్షల రూపాయలు చార్జీల కింద విధిస్తారు. ఈ చార్జీలలోనే వివిధ దేశాలలోకి అనుమతి కోసం కావాల్సిన వీసా, వసతి వంటి అన్ని సేవలు ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఈ ట్రిప్‌ను ఆస్వాదించాలనుకుంటే వెంటనే వీసా సహా అవసరమైన అన్ని పత్రాలతో కంపెనీని సంప్రదిస్తే.. మీ సీటును రిజర్వ్ చేసుకోవచ్చు. 

For More News..

స్టైలిష్ లుక్‎లో దినసరి కూలి.. ఫోటోలు వైరల్

జగన్ తో అలీ భేటీ.. త్వరలో కీలక ప్రకటన