జగన్ తో అలీ రాజకీయ భేటీ

జగన్ తో అలీ రాజకీయ భేటీ
  • అదేమిటో నాక్కూడా తెలియదు: సినీ నటుడు అలీ

అమరావతి: ఊహించినట్లే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సినీ నటుడు అలీ భేటీ అయ్యారు. మంగళవారం సతీసమేతంగా విజయవాడ వచ్చిన అలీ.. సీఎం జగన్ తో సమావేశమయ్యారు.  అక్కడే ఉన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను అలీ కలిసి మాటా మంతి జరిపారు. వారం రోజుల క్రితం ప్రముఖ నటులతో కలసి సినిమా టికెట్ రేట్ల గురించి చర్చలో పాల్గొన్న అలీ.. మళ్లీ వారంలోపే జగన్ తో ఏకాంతంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భార్యతో కలసి జగన్ తో సమావేశమైన అలీ.. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ‘సీఎంవో నుంచి ఆహ్వానం వచ్చింది. వచ్చి కలవమంటే.. కుటుంబ సమేతంగా వచ్చేశాను. సీఎం జగన్ తో భేటీ చాలా హ్యాపీగా జరిగింది. అతి త్వరలో కీలక ప్రకటన ఉంటుందన్నారు.. అతి త్వరలో పార్టీ ఆఫీసు నుంచే ప్రకటన వస్తుంది. బహుశా రెండు వారాల్లో వస్తుందని భావిస్తున్నా.. అది ఏమిటో నాక్కూడా తెలియదు అన్నారు. సినిమా టికెట్ రేట్ల గురించి.. మరికొన్ని సినీ, రాజకీయ అంశాల గురించి చర్చ జరిగింది’ అని అలీ చెప్పారు.

పదవులు ఆశించి పార్టీలో చేరలేదు
గత ఎన్నికల సమయంలో తాను వైసీపీలో చేరింది పదవుల కోసం కాదని.. ఏమీ అడక్కుండానే చేరానని అలీ చెప్పారు. ‘పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని చెప్పలేదు.  రాజశేఖర్ రెడ్డి గారు సీఎం కాక ముందు నుంచే నాకు ఆ కుటుంబంతో పాత పరిచయం. 2003లో వైఎస్ ను పాదయాత్ర తర్వాత కలిశాను. అప్పుడే జగన్ ను కూడా కలిశాను. జగన్ కు పెళ్లి కాక ముందు నుంచే నాకు పరిచయం ఉంది. ఇప్పుడు కూడా కలిశాను. కాకపోతే ఇప్పుడు ఆయన సీఎం హోదాలో ఉన్నారు.  నా భార్య చాలా రోజులుగా జగన్ ను కలసి ఫోటో తీసుకుంటానని కోరుతోంది.. ఆమెకు ప్రామిస్ చేశాను కాబట్టే ఈరోజు ఆమెతో కలసి వచ్చి జగన్ తో సమావేశమయ్యాయను’ అని అలీ చెప్పారు.
 

రాజకీయాలు కొత్త కాదు.. గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు 
తనకు రాజకీయాలు కొత్త కాదని.. 1999లోనే కండువా కప్పుకున్నానని.. అప్పటి నుంచే రాజకీయాలతో టచ్ లోనే ఉన్నాననని వివరించారు సినీ నటుడు అలీ. నేను ఏమీ ఆశించకుండానే పార్టీలోకి వచ్చానని అలీ అన్నారు. గత ఎన్నికల్లో చాలా తక్కువ సమయం ఉండడంతో పార్టీ కోసం ప్రచారం చేస్తానని మాత్రమే చెప్పానని.. చెప్పినట్లే చేశానని అలీ గుర్తు చేశారు. నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నా... చాలా తక్కువ సమయం ఉండడం వల్ల జనంతో కలిసే అవకాశం ఉండబోదని అంగీకరించలేదన్నారు. అందరినీ కలసి.. వారితో కనెక్ట్ కాకుండానే పోటీ చేయడం సరికాదనే ఉద్దేశంతో తాను గత ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు అలీ. 

 

ఇవి కూడా చదవండి:

జగన్‌తో సమావేశానికి నేను రానన్నా

ఏపీలో తగ్గిన కరోనా..కొత్త కేసులు ఎన్నంటే

సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు!