- పేదల ఆకలి తీర్చేందుకు జొన్నలు, మక్కలు వాడాలి
- గురుకులాల్లో విద్యార్థులకూ
- ఆహారంగా అందించాలి
- ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు
- డిప్యూటీ సీఎం ఆదేశాలు
- రిసోర్స్ మొబిలైజేషన్ కేబినేట్ సబ్ కమిటీ సమావేశం
- గురుకులాల్లో విద్యార్థులకూ ఆహారంగా అందించాలి
- ఇందుకోసం కార్యాచరణ
- సిద్ధం చేయాలని అధికారులకు
- డిప్యూటీ సీఎం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: మార్క్ ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మక్కలను కేవలం మార్కెట్ సరుకులుగా చూడవద్దని, వాటిని పేదవాడి ఆకలి తీర్చే సాధనాలుగా మార్చాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. బహిరంగ వేలం వేస్తే మధ్యవర్తులు లాభపడే అవకాశం ఉందని, అలాకాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ దుకాణాల) ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు వీటిని వినియోగించాలన్నారు.
మక్కలను పౌల్ట్రీ రైతులకు నేరుగా కేటాయించాలని, ఇందుకు కార్యచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగళవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన ‘రిసోర్స్ మొబిలైజేషన్’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు పారిశ్రామిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలన్నీ సామాన్యుడి సంక్షేమమే కేంద్రబిందువుగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అవతలికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం రూపొందించిన ‘హిల్ట్ పాలసీ’ మార్గదర్శకాలను తక్షణమే ఖరారు చేసి, ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నగరాన్ని అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ఆదాయ వనరులను పెంచడంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అధికారులకు సూచించారు.
హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ వంటి కీలక సంస్థల ద్వారా భూముల అమ్మకం చేపట్టి, ఆదాయ వృద్ధిని సాధించాలని, ఆ ఆదాయాన్ని తిరిగి ప్రజా సంక్షేమ పథకాలకే వినియోగిస్తామని వివరించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఫైనాన్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
