మహాలక్ష్మి స్కీమ్‌‌‌‌తో ఆర్టీసీకి పూర్వ వైభవం: మంత్రి పొన్నం

మహాలక్ష్మి స్కీమ్‌‌‌‌తో ఆర్టీసీకి పూర్వ వైభవం: మంత్రి పొన్నం

కరీంనగర్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు ఈ నెల 31న రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌‌‌‌ న్యూస్‌‌‌‌ చెప్పబోతున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం కరీంనగర్ డిపో-2లో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్, ఖమ్మం రీజియన్లకు చెందిన 45 మందికి మంత్రి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ జర్నీతో బస్సులన్నీ కిక్కిరిసి, ఆర్టీసీకి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కొత్తగా వెయ్యి బస్సులను కొనుగోలు చేయనున్నామని తెలిపారు. అలాగే, 3 వేల మంది ఉద్యోగులను నియమించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సంస్థలోని 43 వేల మంది ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేస్తూ లక్షల మంది ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారని కొనియాడారు. ఆర్టీసీలో ప్రైవేట్ అద్దె బస్సుల యజమానులు భాగస్వాములైనందుకు వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘునందన్ రావు, ఈడీ(అడ్మిన్) కృష్ణ కాంత్, కరీంనగర్ ఆర్ఎం సుచరిత, డిప్యూటీ ఆర్ఎంలు భూపతి రెడ్డి, సత్యనారాయణ, డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ విలాస్ రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, పర్సనల్ ఆఫీసర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.