జనం జేబులో 14 లక్షల కోట్లు.. ఈక్విటీ పెట్టుబడులతో గత 5 ఏళ్లలో మంచి లాభాలు

జనం జేబులో 14 లక్షల కోట్లు.. ఈక్విటీ పెట్టుబడులతో గత 5 ఏళ్లలో మంచి లాభాలు

న్యూఢిల్లీ: మ్యూచువల్​ఫండ్స్, స్టాక్‌‌ పెట్టుబడులు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కుటుంబాల సంపద భారీగా పెరిగింది. దీని విలువ రూ.13 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్ల వరకు ఉంది. బెయిన్ అండ్ కంపెనీ రిపోర్ట్​ప్రకారం.. గత ఐదేళ్లలో వీళ్ల సంపద విలువ 13 శాతం పెరిగింది. రిటైల్ పెట్టుబడుల తీరులోనూ మార్పులు వచ్చాయి. డిపాజిట్ల కంటే మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్​), లిస్టెడ్ ఈక్విటీ ఆస్తులు వేగంగా పెరిగాయి.  అయితే ఎంఎఫ్, ఈక్విటీ కేటాయింపుల్లో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఇంకా వెనుకబడే ఉంది. 

అమెరికాలో ఇది 50 నుంచి 60 శాతం, బ్రెజిల్​లో 40 నుంచి 45 శాతం దాకా ఉంది. మన దగ్గర 20 శాతం మాత్రమే ఉంది. 2025 చివరి నాటికి వ్యక్తుల మ్యూచువల్ ఫండ్ అసెట్స్​ అండర్​ మేనేజ్​మెంట్ విలువ రూ.41 లక్షల కోట్లకు చేరింది. గత ఐదేళ్లలో కుటుంబాల పెట్టుబడులు ఆరు శాతం నుంచి 11 శాతానికి పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఈక్విటీ ఆధారిత ఫండ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్ల (సిప్) పట్ల పెరుగుతున్న నమ్మకం, ఆర్థిక అక్షరాస్యత పెరగడం ఈ వృద్ధికి కీలకంగా మారాయి. నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరగడంతో 2025 చివరి నాటికి వ్యక్తిగత, డైరెక్ట్ ఈక్విటీ హోల్డింగ్స్ రూ.42 లక్షల కోట్లకు చేరాయి.  

2025లో పెట్టుబడుల తీరును మార్చిన 5 మెగా ట్రెండ్స్ ఇవే..

  • ఎన్​ఎస్​ఈలో రిజిస్టర్ అయిన 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల వాటా 2020 ఆర్థిక సంవత్సరంలో 25 శాతం నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 40 శాతానికి పెరిగింది.
  •     
  • గ్రో, జీరోధా, అప్​స్టాక్స్ వంటి యాప్ ఆధారిత ప్లాట్​ఫామ్​లు పెట్టుబడిని కాగిత రహితంగా, సులభంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చాయి.  మొత్తం రిటైల్ ఈక్విటీ ఇన్వెస్టర్లలో దాదాపు 80 శాతం మందికి ఈ ప్లాట్​ఫామ్​లు సేవలను అందిస్తున్నాయి.
  •     
  • ఎంఎఫ్​లలో పెట్టుబడుల రూల్స్​సరళంగా మారడం, స్కీమ్ హేతుబద్ధీకరణ, ఒకేరకమైన వ్యయ పరిమితి ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి.
  •     
  • యూట్యూబ్, ఇన్​స్టాగ్రామ్, ఫిన్​టెక్ యాప్​ల వంటి వాటిలో ప్రాంతీయ, డిజిటల్ ఆర్థిక కంటెంట్ పెరగడం వల్ల పెట్టుబడి విధానాలు మరింత సులభంగా అర్థమవుతున్నాయి. 
  •     
  • నిఫ్టీ, సెన్సెక్స్ గత పదేళ్లలో 10 నుంచి 15 శాతం రాబడులను అందించింది.  
  • గత ఐదేళ్లలో సంప్రదాయ ఫిక్స్​డ్ డిపాజిట్ల కంటే మ్యూచువల్ ఫండ్స్, ముఖ్యంగా ఈక్విటీ ఆధారిత పథకాలు భారీ రాబడులను అందించాయి.