కానుకల కాలం వచ్చేసింది

కానుకల కాలం వచ్చేసింది

న్యూఢిల్లీ: కరోనా మొదలయ్యాక కార్పొరేట్‌‌ కంపెనీలు గిఫ్టులు ఇవ్వడం మానేశాయి. ఇప్పుడు పరిస్థితి మామూలు స్థితికి రావడంతో గిఫ్టింగ్‌‌ కల్చర్‌‌ మళ్లీ షురువైంది. కార్పొరేట్‌‌ కంపెనీలు తమ క్లయింట్లకు, ఎంప్లాయిస్‌‌కు మొక్కలు, బయోడీగ్రేడబుల్‌‌ సీడ్‌‌ పాట్స్‌‌, పేపర్‌‌, డిజిటల్‌‌ గిఫ్ట్‌‌కార్డులు, న్యూట్రిషన్​ బార్ల వంటివి బహుమతులుగా ఇస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమంటే కంపెనీలు పర్యావరణానికి అనుకూలమైన, ఆరోగ్యానికి మేలు చేసే కానుకలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయి. చాలా కంపెనీలు తమ ఎంప్లాయిస్‌‌కు ఫెస్టివల్‌‌ గిఫ్టులు ఇవ్వడం మొదలుపెట్టాయని డిజిటల్‌‌ గిఫ్ట్‌‌ కార్డుల సెల్లర్‌‌... గిఫ్టర్‌‌ ఫౌండర్‌‌, సీఈఓ అరవింద్‌‌ ప్రభాకర్ చెప్పారు. చాలా మందికి జీతాల్లో కోత పెట్టారని, వారిని సంతోషపర్చడానికి కార్పొరేట్‌‌ కంపెనీలు భారీగా గిఫ్టులు ఇస్తున్నాయని చెప్పారు. సౌతిండియాకు చెందిన స్టార్టప్‌‌ చీఫ్‌‌ ట్యాలెంట్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ ‘‘కరోనా వల్ల కొంత మంచి కూడా జరిగింది. వర్క్‌‌ ఫ్రం హోం వల్ల మేం ఎంప్లాయిస్‌‌పై పెట్టే ఖర్చులు చాలా తగ్గాయి. ఎంతో డబ్బు మిగిలింది. ఇందులో ఎంతోకొంత మొత్తాన్ని గిఫ్టుల రూపంలో వారికి ఇస్తున్నాం’’ అని వివరించారు. ఇలాంటి చర్యల ద్వారా ఎంప్లాయిస్‌‌తో, క్లయింట్లతో సంబంధాలు బలోపేతమవుతాయని, బిజినెస్‌‌ మరింత ఎదుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. 
ఆరోగ్యమే మహాభాగ్యం...
కరోనా తరువాత ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి మరింత ఇంపార్టెన్స్‌‌ ఇస్తున్నారు. కంపెనీలు కూడా హెల్త్‌‌ను బాగుచేసే గిఫ్టులు ఇస్తున్నాయి. ఇలాంటివాటిలో ఎక్కువగా టార్టిలా ప్యాక్స్‌‌, ఎగ్జోటిక్‌‌ టీస్‌‌, మార్ష్‌‌మాలోస్‌‌ వంటి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యానికి హాని చేయని టర్కిష్‌‌ బక్లావా వంటి స్వీట్‌‌ బాక్సులను కొన్ని కంపెనీలు గిఫ్టులుగా ఇస్తున్నాయని ఆన్‌‌లైన్‌‌ గిఫ్టింగ్‌‌ కంపెనీ ఐజీపీడాట్‌‌కామ్ ఫౌండర్‌‌ తరుణ్ జోషి చెప్పారు. 2019తో పోలిస్తే ప్రస్తుతం కంపెనీలు గిఫ్టింగ్‌‌ బడ్జెటును 30 శాతం దాకా పెంచాయని అన్నారు. తమ సైట్‌‌ ద్వారా పోషకాహారం, పూలు, ఫ్యాషన్‌‌, ఫెస్టివల్‌‌ ప్రొడక్టులు అమ్ముతున్నామని వివరించారు. 2019తో పోలిస్తే  అమ్మకాలు వందశాతం పెరిగాయని అన్నారాయన. తమ సైటు ద్వారా 400 కంపెనీలు గిఫ్టులు ఇస్తున్నాయని, వీటిలో 70 శాతం కంపెనీలు కొత్తవని పేర్కొన్నారు. ఫెర్న్స్‌‌ అండ్‌‌ పెటల్స్‌‌ పేరుతో గిఫ్టింగ్‌‌ కంపెనీ నడిపే వికాస్‌‌ గుగూటియా మాట్లాడుతూ 2019తో పోలిస్తే గిఫ్టుల అమ్మకాలు 116 శాతం పెరిగాయని చెప్పారు. ఫోక్స్‌‌ వేగన్, మాక్స్ లైఫ్, మెట్‌‌లైఫ్, అడోబ్, బ్లూస్టార్, లుపిన్, అబోట్, నెట్‌‌కోర్, ఐసిఐసిఐ బ్యాంక్, ఆదిత్య బిర్లా, అల్ట్రాటెక్, స్ట్రైకర్, సేపియంట్‌‌, వేదాంతు వంటి కంపెనీలు తమ కస్టమర్లని తెలిపారు. 

ఆన్‌‌లైన్‌‌ గిఫ్టు కార్డులకు మస్తు గిరాకీ
ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ బాగా పెరిగింది కాబట్టి కంపెనీలు.. అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్‌‌ వంటి వాటిలో షాపింగ్‌‌ చేసుకునేందుకు డిజిటల్ గిఫ్ట్‌‌కార్డులను ఇస్తున్నాయి. గిఫ్టింగ్‌‌ మార్కెట్లో 75 శాతం వాటా కార్పొరేట్‌‌ కంపెనీలదేనని డిజిటల్‌‌ పేమెంట్‌‌ సేవలు అందించే క్విక్‌‌సిల్వర్‌‌ కో–ఫౌండర్‌‌ టీపీ ప్రతాప్‌‌ చెప్పారు. ఈ ఏడాది అమ్మకాలు 30 శాతం పెరుగుతాయని ఆయన అంచనా వేశారు.  న్యూఏజ్‌‌, మీడియం ఎంటర్‌‌ప్రైజెస్‌‌ కంపెనీలు ఎక్కువగా గిఫ్టులు ఇస్తున్నాయని గిఫ్టింగ్‌‌ కంపెనీలు అంటున్నాయి. 2019లో మనదేశంలో గిఫ్టింగ్‌‌ మార్కెటింగ్‌‌ విలువ 65 బిలియన్‌‌ డాలర్లు కాగా, ఈ ఏడాది ఇది 70 బిలియన్‌‌ డాలర్లకు చేరుతుందని అంచనా. కరోనా ఎఫెక్ట్‌‌ లేకపోవడం, ఎంప్లాయిస్ ఆఫీసులకు తిరిగి వస్తుండటంతో కార్పొరేట్లు వారికి భారీగా గిఫ్టులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రతాప్‌‌ వివరించారు. ఆన్‌‌లైన్‌‌ గిఫ్టింగ్‌‌ మరింత వేగంగా దూసుకెళ్తుందని, మహమ్మారి కారణంగా ఎక్కువ మంది ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌కు అలవాటయ్యారని అన్నారు. టూరిజం, హాస్పిటాలిటీ వంటి సెక్టార్లు పూర్తిగా కోలుకోలేదని, ఇవి కూడా గాడినపడితే గిఫ్టింగ్‌‌ కంపెనీలకు ఆదాయం మరింత పెరుగుతుందని ఒక కార్పొరేట్‌‌ కంపెనీ హెచ్‌‌ఆర్‌‌ చీఫ్‌‌ అన్నారు.