హైదరాబాద్, వెలుగు: టెక్ కంపెనీ గూగుల్ ఆంధ్రప్రదేశ్ నగరం విశాఖపట్నంలో భారీ ఏఐ హబ్ నిర్మాణానికి భూమి పూజ చేసింది. అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. 2026 నుంచి 2030 మధ్య భారతదేశంలో 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టే ప్రణాళికలో ఇది ఒక భాగం. ఈ ప్రాజెక్టు ద్వారా గిగావాట్ స్థాయి ఏఐ ఎకోసిస్టమ్ ఏర్పాటు కానుంది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
విశాఖపట్నం చుట్టుపక్కల నీటి సంరక్షణ, మత్స్యకారుల కోసం ఆధునిక సాంకేతికత అందించడం వంటి సామాజిక కార్యక్రమాలను గూగుల్ చేపట్టింది. నారి శక్తి ప్రోగ్రామ్ ద్వారా 10 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇస్తారు. ఏఐ కారిడార్ అభివృద్ధికి ఈ హబ్ కీలకంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇది వికసిత్ భారత్ 2047 విజన్‌కు తోడ్పడుతుందని గూగుల్ తెలిపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు.

