గూగుల్ సంస్థలో వేధింపులు 

గూగుల్ సంస్థలో వేధింపులు 
  •     సీఈఓ సుందర్ పిచాయ్ కి 1,300 మంది ఉద్యోగుల బహిరంగ లేఖ 
  •     వర్క్ ప్లేస్ లో రక్షణ కల్పించాలని వినతి 

వర్క్ ప్లేస్ లో వేధింపులు ఎక్కువయ్యాయని గూగుల్ ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్ కి బహిరంగ లేఖ రాశారు. పని చేసే చోట తమకు రక్షణ కల్పించాలని కోరారు. 1,300 మంది ఉద్యోగులు రాసిన ఈ లెటర్ ను మీడియం అనే ఆన్ లైన్ బ్లాగ్ లో పోస్టు చేశారు. అందులో ఎంప్లాయీస్ పేర్లు కూడా ఉన్నాయి. కంపెనీలో తాను వేధింపులు ఎలా ఎదుర్కొన్నననే దానిపై మాజీ ఉద్యోగి ఒకరు న్యూయార్క్ టైమ్స్ లో రాసిన ఆర్టికల్ గురించి లెటర్ లో పేర్కొన్నారు. వేధింపులకు పాల్పడే వారిని టీమ్ లీడర్లుగా నియమించొద్దని కోరారు. ఒకవేళ వేధింపులు నిజమని తేలితే, వెంటనే టీమ్ లీడర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. అదే టీమ్ లీడర్ తో బాధితురాలు పని చేయాల్సిన అవసరం రాకుండా చూడాలన్నారు. వేధింపుల సమస్యలను ఇంతకుముందే మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకొచ్చామని అయినా.. గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ తీరు మారడం లేదని ఉద్యోగులు మండిపడ్డారు.
 
నిందితులను కాపాడుతున్రు.. 

బాధితులకు మద్దతుగా నిలవాల్సిన కంపెనీ.. నిందితుల పక్షాన ఉంటోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ మేనేజ్ మెంట్ నిందితులను కాపాడుతోందని ఆరోపించారు. అల్ఫాబెట్ లో గత కొంత కాలంగా ఇలాగే జరుగుతోందన్నారు. ఫిర్యాదు చేసిన బాధితులే కంపెనీ వదిలిపోయేలా చేస్తున్నారని వాపోయారు. వేధింపులకు పాల్పడినోళ్లు మాత్రం కంపెనీలోనే ఉంటున్నారన్నారు. నిందితులకు రివార్డులు కూడా ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంతకుముందు జరిగిన రెండు సంఘటనలను లెటర్ లో పేర్కొన్నారు. ఓరల్ సెక్స్ చేయాలని మహిళను వేధించిన ఆండీ రూబిన్ కు 90 మిలియన్ డాలర్ల ఎగ్జిట్ ప్యాకేజీ ఇచ్చారని, లైంగిక వేధింపులకు పాల్పడిన అమిత్ సింఘాల్ కు 35 మిలియన్ డాలర్ల రివార్డు ఇచ్చారని గుర్తు చేశారు.