అదానీ భాగస్వామ్యంతో విశాఖలో గూగుల్ AI హబ్.. క్లీన్ ఎనర్జీతో మెగా డేటా సెంటర్

అదానీ భాగస్వామ్యంతో విశాఖలో గూగుల్ AI హబ్.. క్లీన్ ఎనర్జీతో మెగా డేటా సెంటర్

అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశంలోని వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ అలాగే ఎయిర్ టెల్ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ కేంద్రంగా ఏఐ హబ్ ఏర్పాటు చేస్తోంది. 15 బిలియన్ డాలర్లు అంటే దాదాపు లక్షా 30వేల కోట్ల రూపాయల మెగా పెట్టుబడితో వస్తున్న ఈ ప్రాజెక్ట్ రానున్న ఐదేళ్లలో దశలవారీగా పూర్తి కానుందని సమాచారం. ఈ కేంద్రం ఏఐ, క్లౌడ్ సేవలకు కీలకంగా మారుతుందని వెల్లడైంది. 

విశాఖలో యూట్యూబ్, వర్క్ స్పేస్ వంటి సంస్థలు వినియోగించే హై పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ ఇన్ ఫ్రా ఏర్పాటుకు గూగుల్ సిద్ధమైంది. అలాగే ఈ కేంద్రం స్టార్టప్స్, ఎంటర్ ప్రైజెస్, రీసెర్చ్ సంస్థలకు ఏఐపై పనిచేసే సంస్థలకు అడ్డాగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో గూగుల్ విశాఖ తీరం నుంచి అంతర్జాతీయ సముద్ర కేబుల్స్ నిర్మించాలని నిర్ణయించింది. 

వైజాగ్ కేంద్రంగా వస్తున్న ఏఐ డేటా సెంటర్ల ఎనర్జీ అవసరాల కోసం స్థానిక సంస్థలతో జతకట్టాలని గూగుల్ నిర్ణయించింది. విశాఖ నుంచి మయన్మార్, మిజోరాం ప్రాంతాలకు కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కోరారు గూగుల్ సంస్థను. విశాఖలో ప్లాన్ చేసిన ఒక గిగావాట్ రానున్న కాలంలో మరింతగా కెపాసిటీ విస్తరణ ఉంటుందని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ చెప్పారు. ఇది రానున్న ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలను కల్పిస్తుందని సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. అమెరికా బయట గూగుల్ చేసిన అతిపెద్ద ఏఐ పెట్టుబడిగా విశాఖ ఏఐ హబ్ నిలుస్తోందని తెలుస్తోంది.