ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, టెక్ దిగ్గజం గూగుల్, ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) లో దాదాపు 40 బిలియన్ డాలర్ల అంటే సుమారు 3.3 లక్షల కోట్ల పైమాటే భారీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది.
ఒప్పందం వివరాలు:
ఆంత్రోపిక్ కంపెనీ విలువను 380 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టి, గూగుల్ మొదట 10 బిలియన్ డాలర్లను ఇస్తుంది. మిగిలిన 30 బిలియన్ డాలర్లను ఆంత్రోపిక్ సాధించే విజయాలు, పురోగతిని బట్టి విడతల వారీగా అందజేస్తుంది. ఈ ఒప్పందం ద్వారా రెండు కంపెనీల బంధం మరింత బలపడింది:
ఆంత్రోపిక్ 'క్లాడ్' వంటి ఏఐ మోడళ్లను నడపడానికి గూగుల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలను వాడుకుంటుంది. సాధారణంగా వాడే గ్రాఫిక్స్ కార్డ్స్ (GPU) కి బదులుగా, గూగుల్ ప్రత్యేకంగా తయారు చేసిన Tensor Processing Units అనే చిప్స్‌ను ఆంత్రోపిక్ ఉపయోగిస్తుంది. దీనివల్ల ఏఐ అప్లికేషన్లకు అవసరమయ్యే కంప్యూటింగ్ పవర్ (5 గిగావాట్ల వరకు) ఈ సంస్థలకు అందుబాటులోకి వస్తుంది.
గూగుల్ & ఆంత్రోపిక్ కలిసి పనిచేస్తున్నప్పటికీ, మార్కెట్‌లో ఇవి పోటీదారులుగా కూడా ఉన్నాయి. గూగుల్ 'జెమిని' మోడల్స్ అండ్ ఆంత్రోపిక్ 'క్లాడ్' ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. 2023లో గూగుల్ కేవలం 300 మిలియన్ డాలర్లతో (10% వాటా) మొదలుపెట్టి, ఇప్పుడు పెట్టుబడిని క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, గూగుల్‌కు ఆంత్రోపిక్‌లో సుమారు 14 శాతం వాటా ఉంది.
ఆంత్రోపిక్.. ఈ సంస్థను 2021లో గతంలో 'OpenAI' లో పనిచేసిన పరిశోధకులు స్థాపించారు. ఈ కంపెనీ ఏఐ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించడంతో, దీని వార్షిక ఆదాయం 30 బిలియన్ డాలర్లు దాటింది. గూగుల్ కంటే ముందే అమెజాన్ కూడా ఆంత్రోపిక్‌లో దాదాపు 25 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టింది.
ఈ భారీ ఒప్పందంతో, భవిష్యత్తులో ఏఐ రంగంలో తమ పట్టును పెంచుకోవడానికి మైక్రోసాఫ్ట్ (OpenAI భాగస్వామి), గూగుల్ మరియు అమెజాన్ వంటి సంస్థల మధ్య పోటీ మరింత ముదిరిందని చెప్పవచ్చు. దీనివల్ల సాధారణ వినియోగదారులకు మరింత శక్తివంతమైన ఏఐ సాధనాలు అందుబాటులోకి వస్తాయి.

