
- అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వస్తే..మద్దతిచ్చేవారిని బెదిరించిన్రు:రాజాసింగ్
- మీకోదండం.. మీ పార్టీకో దండం
- అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వస్తే
- మద్దతిచ్చేవారిని బెదిరించిన్రు: రాజాసింగ్
- రాష్ట్రంలో బీజేపీ రావద్దనే వాళ్లు ఎక్కువయ్యారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు:గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వెయ్యనివ్వలేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ‘మీకో దండం.. మీ పార్టీకో దండం’ అంటూ తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించినట్లు తెలిపారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో తనను అడ్డుకున్నారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఇష్టం లేని వారు పార్టీలో ఉన్నారని కామెంట్ చేశారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి తాను ముహూర్తం చూసుకుని పార్టీ కార్యాలయానికి వచ్చానని చెప్పారు. ఫామ్ కూడా తీసుకున్నానని, 10 మంది కౌన్సిల్మెంబర్ల సంతకాలు కావాల్సి ఉందని అన్నారు. చాలామంది కార్యకర్తలు తనకు మద్దతు ఇచ్చేందుకు వచ్చినా, వారిని ఫోన్ చేసి బెదిరించి పంపించేశారని ఆరోపించారు. కేవలం ముగ్గురు మాత్రమే తన వెంట వచ్చారని, వారి సంతకాలు మాత్రమే ఉన్నాయని, ఇంకా ఏడుగురి సంతకాలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఆల్రెడీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఎవరిని చేయాలనేది డిసైడ్ అయి అక్కడ కూర్చున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే తాను కిషన్ రెడ్డికి లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చినట్టు వెల్లడించారు. కిషన్ రెడ్డి చేతుల మీదుగానే తాను బీజేపీలో చేరానని, ఇప్పుడు తన రాజీనామాను కూడా ఆయన చేతికే ఇస్తున్నట్టు చెప్పానని అన్నారు. రాజీనామా లేఖలో స్పీకర్‌కు కూడా ఒక లేఖ పంపించాలని కోరానని చెప్పారు. ‘‘రాజాసింగ్ మా ఎమ్మెల్యే కాదు సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు చెప్పాలని కిషన్‌రెడ్డికి చెప్పా. 2014 నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా’’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తనతోపాటు కుటుంబం కూడా టెర్రరిస్ట్‌ల టార్గెట్‌లో ఉందని చెప్పారు.
రాజాసింగ్ ది క్రమశిక్షణా రాహిత్యం: బీజేపీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా వ్యవహారంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం పరాకాష్టకు చేరిందని, పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ అన్నారు. కిషన్ రెడ్డికి సమర్పించిన రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షుడికి పంపించనున్నట్టు వెల్లడించారు. రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించాలని ఆమె సూచించారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో రాజాసింగ్ నామినేషన్ వేస్తానని పార్టీ కార్యాలయానికి వచ్చారని, జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ పాటిల్‌తో చర్చించిన తర్వాత ఆయన కోరిక మేరకు నామినేషన్ పత్రాలు ఇచ్చి అవకాశం కల్పించామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి శోభా కరంద్లాజే వద్ద 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతో నామినేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉందని, రాజాసింగ్ కేవలం ముగ్గురు సభ్యుల సంతకాలతో ఉన్న ఫామ్ మాత్రమే సమర్పించారని వెల్లడించారు.
ఎన్నికల నిబంధన ప్రకారం 10 మంది స్టేట్ కౌన్సిల్ సభ్యుల సంతకాలతో మరో ఫామ్ సమర్పించాలని రాజాసింగ్‌ను శోభా కరంద్లాజే కోరారని, అయితే నామినేషన్‌కు మద్దతిచ్చే స్టేట్ కౌన్సిల్ సభ్యులు లేక చేతులెత్తేసిన ఆయన.. పార్టీ పోటీ చేయనివ్వట్లేదని అబద్ధాలతో అభాండాలు వేస్తున్నారని అన్నారు. గతంలో కూడా రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్య వ్యవహారాలతో సస్పెండ్ అయితే మళ్లీ పార్టీలోకి తీసుకున్నామని తెలిపారు.
ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన నియోజకవర్గానికి వచ్చినా.. వారి కార్యక్రమాలకు హాజరుకాకుండా, పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా రాజాసింగ్ వ్యవహరించారని తెలిపారు. తమ పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని, పార్టీ క్రమశిక్షణను అనేకసార్లు రాజాసింగ్ ఉల్లంఘించారని, చివరికి ఆయనే రాజీనామా చేశారని చెప్పారు.