బీఆర్ఎస్ అధిష్టానానికి ఉద్యమకారుడు హెచ్చరిక.. కూకట్పల్లి టికెట్ ఇవ్వాలని డిమాండ్

బీఆర్ఎస్ అధిష్టానానికి ఉద్యమకారుడు హెచ్చరిక..  కూకట్పల్లి టికెట్ ఇవ్వాలని డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్ని్కలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల్లోనూ అసమ్మతి బయటపడుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని అధిష్టానానికి హెచ్చరికలు పంపుతున్నారు కొందరు నాయకులు. ఎమ్మెల్యే టికెట్లపై ఆశలు పెట్టుకున్న నాయకులందరూ తమ పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. తాజాగా కూకట్పల్లిలో ఇలాంటి సీనే కనిపించింది. రాబోయే ఎన్నికల్లో కూకట్పల్లి బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని, తానే పోటీ చేస్తానని చెప్పారు తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత గొట్టిముక్కల వెంకటేశ్వర రావు. ఈసారి తనకు టికెట్ రాకపోతే రెబల్ అభ్యర్థిగా కూకట్పల్లి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

కూకట్ పల్లిలోని వాసవి గ్రాండ్ లో ఆదివారం రోజు (ఆగస్టు 20న) యూత్ ఇంట్రాక్షన్ పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించానని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పారు.10 సంవత్సరాలుగా తనకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు మళ్లీ టికెట్ ఇస్తే 10 వేల మంది నామినేషన్ వేయాలంటూ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో ఈసారి తనకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల్లో నిలుస్తూ.. ప్రజాసేవకై తాను ఎప్పుడూ ముందున్నానని చెప్పారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ హామీతోనే తాను వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. ఈసారి తనకు టికెట్ రాకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు.