రైతులకు సంకెళ్లు వేసి.. గొలుసులతో కట్టి..

 రైతులకు సంకెళ్లు వేసి.. గొలుసులతో కట్టి..

సంకెళ్లు వేసి, గొలుసులతో కట్టి పోలీసులు తీసుకెళ్తున్న వీళ్లేమీ టెర్రరిస్టులు కాదు.. మట్టిని నమ్ముకున్న రైతులు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్లు సహా సర్వస్వం పోగొట్టుకున్న నిర్వాసితులు. పరిహారం ఇవ్వాలని కోరుతూ జూన్ 14న హుస్నాబాద్ లో ఆందోళన చేశారని రైతులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం వారిని ఇలా హుస్నాబాద్ కోర్టులో హాజరుపరిచారు. రైతులను బేడీలతో చూసి వారి కుటుంబ సభ్యులు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. తమ వారిని పట్టుకుని బోరున విలపించారు. 

  • గౌరవెల్లి నిర్వాసితులకు బేడీలు వేసి.. గొలుసులతో కట్టి.. కోర్టులో హాజరుపరచిన పోలీసులు
     

సిద్దిపేట, వెలుగు: రైతన్నలకు పోలీసులు సంకెళ్లు వేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులను.. నేరస్థులు, టెర్రరిస్టులను తీసుకువచ్చినట్టు సంకెళ్లతో కోర్టులో హాజరుపరిచారు. పరిహారం కోసం జూన్ 14న హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద చేపట్టిన ఆందోళన ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు గుడాటిపల్లికి చెందిన 17 మంది నిర్వాసిత రైతులపై కేసులు పెట్టారు. వీరిలో నలుగురిని అదేరోజు అరెస్టు చేయగా.. మిగిలిన వారు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియదు.

నలుగురిని అదే రోజు రిమాండ్​చేసిన పోలీసులు, 14 రోజుల తర్వాత గురువారం  హుస్నాబాద్ కోర్టుకు తీసుకొచ్చారు. తమ వారిని సంకెళ్లతో చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 2017 ఏప్రిల్‌‌‌‌లో ఖమ్మంలోనూ మద్దతు ధర కోసం ఆందోళన చేసిన పది మంది రైతులను ఇలాగే సంకెళ్లతో కోర్టుకు తీసుకురావడం అప్పట్లో దుమారం రేపింది. తాజాగా మరోసారి రైతులకు సంకెళ్లు వేయడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పరిహారం కోసం రోడ్డెక్కితే టెర్రరిస్టుల్లా తీసుకొస్తరా?

కరీంనగర్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌‌‌‌లో ఉన్న నలుగురు నిర్వాసితులు బద్దం శంకర్ రెడ్డి, ఎ.తిరుపతిరెడ్డి, రాగి శ్రీనివాస్, బుక్యా సక్రులను గురువారం ఉదయం 11 గంటలకు హుస్నాబాద్‌‌‌‌లోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. అప్పటికే రెండు వారాలుగా జైలులో ఉన్న తమ వాళ్లను చూసేందుకు కుటుంబీకులు, గ్రామస్తులు కోర్టు వద్దకు చేరుకున్నారు. ప్రత్యేక వాహనంలోంచి నలుగురు రైతులు సంకెళ్లతో దిగడాన్ని చూసిన కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఇల్లు, జాగ కోల్పోయి.. న్యాయమైన పరిహారం కోసం రోడ్డెక్కితే పోలీసులు కేసులు పెట్టుడే కాకుండా దొంగలు,  క్రిమినల్స్, టెర్రరిస్టులను తీసుకొచ్చినట్లు తీసుకురావడాన్ని చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. రైతులను పట్టుకొని బోరున విలపించారు. ఈ కేసుకు సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్లను పోలీసులు కోర్టుకు సమర్పించకపోవడంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో రూల్స్ ప్రకారం కోర్టు నలుగురి రిమాండ్‌‌‌‌ను జడ్జి మరో 14 రోజులు పొడిగించారు. దీంతో గుడాటిపల్లి గ్రామస్థులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. కోర్టులో కావాలనే డాక్యుమెంట్లు సమర్పించలేదని, అందువల్లే రైతులకు బెయిల్ రాలేదని ఆరోపించారు.

దాడి చేసిన టీఆర్ఎస్ లీడర్లను వదిలేసిన్రు

గౌరవెల్లి ప్రాజెక్టు కింద కోల్పోయిన భూములు, ఇండ్లకు సంబంధించి న్యాయమైన పరిహారం కోసం కొంతకాలంగా పోరాడుతున్న గుడాటిపల్లి నిర్వాసితులు.. జూన్ 14న హుస్నాబాద్‌‌‌‌లోని ఎమ్మెల్యే సతీశ్ క్యాంపు ఆఫీస్​ముట్టడించారు. పోటీగా గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్​రన్​అడ్డుకోవద్దంటూ ఎమ్మెల్యే అనుచరులు, అధికార పార్టీ కార్యకర్తలు ర్యాలీ తీశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అదే సమయంలో టీఆర్ఎస్ లీడర్లు కూడా కర్రలు పట్టుకొని నిర్వాసితులపై దాడి చేశారు.

ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో 17 మంది నిర్వాసితులపై ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 332, 324, 326, 341, 353, 294(b),  R/W 148 కింద కేసులు నమోదు చేశారు. నిర్వాసితులపై దాడి చేసిన టీఆర్ఎస్ నేతలపై మాత్రం ఎలాంటి కేసులు పెట్టలేదు. నలుగురు రైతులను రిమాండ్​ చేయగా, కేసుల భయంతో మిగిలిన వాళ్లు గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఆ 13 మంది ఎక్కడ ఉన్నారనేది ఇప్పటికీ తెలియలేదు.

ఖమ్మంలో ఏం జరిగిందంటే..

2017 ఏప్రిల్ 28న ఖమ్మం మార్కెట్‌‌‌‌కు 2 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. అంతకుముందు వరుసగా రెండు రోజులు మార్కెట్‌‌‌‌కు సెలవు కావడం, తర్వాత రెండురోజులు సెలవులు ఉంటాయనే ప్రచారంతో రైతులు ఎక్కువ బస్తాలు తీసుకువచ్చారు. ఇదే అదనుగా వ్యాపారులు రేటు తగ్గించడం, ఆఫీసర్లు కూడా వాళ్లకే వంతపాడడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఆగ్రహానికి గురైన కొందరు మార్కెట్ ఆఫీస్‌‌‌‌పై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేసి కుర్చీలను విరగ్గొట్టారు. దీంతో అదే నెల 30న 10 మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచే సమయంలో బేడీలు వేసి, గొలుసులతో కట్టి తీసుకురావడం రాజకీయంగా పెను దుమారం రేపింది.

వారేమీ హంతకులు కాదు

గౌరవెల్లి కోసం ఇండ్లు, పొలాలు త్యాగం చేసిన రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడం అన్యాయం. న్యాయమైన పరిహారం కోసం ఆందోళన చేస్తే దొంగలు, క్రిమినల్స్‌‌‌‌లా కోర్టుకు తీసుకొస్తరా? క్రిమినల్ ఇంటెన్షన్‌‌‌‌తో ఆందోళన చేయలేదు. పోలీసులు బేడీలు వేసి కోర్టుకు హాజరుపరచడాన్ని  ప్రజస్వామిక వాదులంతా ఖండించాలి. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి రైతుల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించకుండా చర్యలు తీసుకోవాలి. - పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ