
Indian citizenship: భారత పౌరసత్వాన్ని వదులేస్తున్న ఇండియన్స్ సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోవటం కొంత ఆందోళనకరంగానే ఉంటోంది. గడచిన 5 ఏళ్లుగా ఈ సంఖ్య వేగంగా పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. చాలా మంది తమ వ్యక్తిగత కారణాలు లేదా వృత్తిపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంటుంటారు. అయితే కొన్నాళ్లుగా సంపన్న వర్గాల నుంచి చాలా మంది విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యే ధోరణి పెరగటం కూడా ఒక ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.
విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి క్రితి వర్థన్ సింగ్ 2024లో భారత పౌరసత్వం వదులుకున్న వారి లెక్కలను రాతపూర్వకంగా శుక్రవారం లోక్ సభలో అందించారు. కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఇచ్చిన సమాచారంలో కేవలం 2024 ఒక్క సంవత్సరంలోనో 2 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు పౌరసత్వాన్ని వీడినట్లు వెల్లడైంది. 2024లో 2,06,378 మంది, 2023లో 2,16,219 మంది, 2022లో 2,25,620 మంది, 2021లో 1,63,370 మంది.. 2020లో 85,256 మంది పౌరసత్వం వీడినట్లు తేలింది. దానికి ముందు 2011 నుంచి 2014 మధ్య కాలంలో సగటున 1.20 లక్షల మంది ఇదే నిర్ణయం తీసుకున్నారు.
ALSO READ : ఐసిఐసిఐ కస్టమర్లకు బిగ్ షాక్ ..
విదేశాల్లో స్థిరపడి అక్కడి పౌరసత్వం తీసుకోవటానికి వ్యక్తిగతమైన కారణాలు ఇందుకు కారణం కావొచ్చని ప్రభుత్వం చెబుతోంది. విదేశాల్లో స్థిరపడిన సంపన్నమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ భారతదేశానికి ఒక ఆస్తిగా భావిస్తున్నట్లు మంత్రి అన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల జనాభా 3,43,56,193 అని ప్రభుత్వం తెలిపింది.