
దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ తన సేవింగ్ ఖాతాల మినిమం బ్యాలెన్స్ రూల్స్ మార్పులను ప్రకటించింది. ఆగస్టు 1, 2025 నుంచి మెట్రోలు, నగరాలు, టౌన్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని తన బ్రాంచ్ ఖాతా హోల్డర్లు సగటున ఖాతాలో ఉంచాల్సిన బ్యాలెన్స్ పరిమితులను భారీగా పెంచేసింది ఐసిఐసిఐ. ఈ తేదీ తర్వాత ఖాతాలు తెరిచే కొత్త కస్టమర్లకు కొత్త రూల్స్ వర్తిస్తాయని బ్యాంక్ క్లారిఫై చేసింది. అంటే ఇప్పటికే అకౌంట్స్ ఉన్న సేవింగ్స్ ఖాతా కస్టమర్లపై ప్రభావం ఉండబోదని బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం అర్థమౌతోంది. దీంతో దేశంలోని అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ మినిమం బ్యాలెన్స్ రూల్స్ ప్రస్తుతం అమలులోకి తెచ్చింది బ్యాంక్. దీంతో కొత్త కస్టమర్లతో పాటు ప్రస్తుతం ఉన్న ఐసిఐసిఐ కస్టమర్లు డైలమాలో పడ్డారు.
మార్పులు చేసిన సేవింగ్స్ ఖాతాల మినిమం బ్యాలెన్స్ పరిమితులను పరిశీలిస్తే.. మెట్రో నగరాలు అలాగే సిటీల్లో మినిమం బ్యాలెన్స్ గతంలో రూ.10వేలు ఉండగా దానిని ప్రస్తుతం రూ.50వేలకు పెంచింది బ్యాంక్. ఇక సెమీ అర్బన్ బ్రాంచ్ కస్టమర్లు గతంలో రూ.5వేలు మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం అది రూ.25వేలకు పెంచబడింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఖాతాదారులు రూ.2వేల 500 మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సి ఉండగా ప్రస్తుతం దానిని రూ.10వేలకు పెంచింది బ్యాంక్.
ఒకపక్క ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు వరుసగా తమ కస్టమర్లపై మినిమం బ్యాలెన్స్ భారాన్ని తగ్గిస్తూ పూర్తిగా ఉచితంగా ఖాతాలను ఆఫర్ చేస్తుండగా.. ఐసిఐసిఐ భారీగా ఈ పరిమితిని పెంచటంపై కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే తమ ఖాతాలో తక్కువ డబ్బు ఉన్నప్పుడు పెనాల్టీల మోత మోగిపోద్దని అంటున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం తమ కస్టమర్లకు సేవింగ్స్ ఖాతాల్లో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ అక్కర్లేదని చెబుతున్నాయి.
►ALSO READ | వియత్నాంలో ఆపిల్ మ్యాక్‌బుక్ కొన్న ట్రావెలర్.. సూపర్ రూ.36వేలు సేవింగ్..
ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విషయానికి వస్తే మెట్రో అర్భన్ బ్రాంచీల్లో మినిమం బ్యాలెన్స్ రూ.10వేలు, సెబీ అర్భన్ ఖాతాల్లో రూ.5వేలు, గ్రామీణ శాఖల్లో రూ.2వేల 500 రూల్స్ కొనసాగిస్తోంది. వాస్తవానికి బ్యాంకులు తమ రోజువారా వ్యాపార కార్యకలాపాలు, పెట్టుబడుల కోసం మినిమం బ్యాలెన్స్ రూల్స్ పెడుతుంటాయి. ప్రస్తుతం ఐసిఐసిఐ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాలో నిల్వ చేసిన డబ్బుపై చాలా తక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది.