ఈసారి కూడా రాజ్ భవన్లోనే రిపబ్లిక్ డే వేడుకలు.. 

ఈసారి కూడా రాజ్ భవన్లోనే రిపబ్లిక్ డే వేడుకలు.. 

గణతంత్ర దినోత్సవ వేడుకల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతేడాదిలాగే ఈసారి కూడా పరేడ్ గ్రౌండ్లో కాకుండా రాజ్ భవన్ లో నిర్వహించాలంటూ ప్రభుత్వం లేఖ పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పేరుతో రిపబ్లిక్ డే వేడుకలు జరపకపోవడంపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 21న రాజ్ భవన్కు లేఖ పంపిన ప్రభుత్వం ఈసారి కూడా రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, గవర్నర్ తమిళిసై జాతీయ జెండా ఎగరవేస్తారని అందులో చెప్పింది.  చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని లేఖలో స్పష్టం చేసింది. 

ప్రభుత్వ నిర్ణయంతో ఈసారి కూడా గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆమె సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడ రిపబ్లిక్ డే వేడుకల్లో తమిళిసై పాల్గొంటారు. 

ఇదిలా ఉంటే తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. రాష్ట్రాలు గణతంత్ర వేడుకలు నిర్వహించి విద్యార్థులను అందులో భాగస్వాములను చేయాలని కేంద్రం సర్కులర్ పంపినా కేసీఆర్ సర్కారు దాన్ని బేఖాతరు చేస్తోందని పిటిషన్ లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్రం ధిక్కరించడంపై దాఖలైన ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై జస్టిస్ మాధవి ధర్మాసనం విచారణ జరపనుంది.