- బోధన్ లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌ను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్ రెడ్డి
- విద్యార్థులను అభినందించి, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని సూచన
బోధన్, వెలుగు: ‘విద్యార్థుల ప్రదర్శనలు బాగున్నాయి.. రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలి, చదువుతోపాటు సామాజిక అవగాహన అవసరం’ అని ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శరెడ్డి అన్నారు. సోమవారం బోధన్ లోని విజయ మేరీ హైస్కూల్ లో జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్, ఇన్ స్పైర్ను కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. కూరగాయల సాగు, సోలార్ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు సాధనాలు, కాలుష్య నియంత్రణ, పౌష్టికాహారం తదితర ప్రదర్శనలను చూసి అభినందించారు.
అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్‌ఫెయిర్ దోహదపడుతుందన్నారు. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతిక విద్యకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. భగవద్గీత గ్రంథాన్ని మూడు నెలల వ్యవధిలో ఉర్దూలో అనువదించిన బోధన్ పట్టణానికి చెందిన ముస్లిం యువతి ఫాతిమాను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అభినందిస్తూ సన్మానించారు.
ప్రైవేటు స్కూల్స్ పాల్గొనాలి:కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
సైన్స్ ఫెయిర్, ఇన్ స్పైర్ కార్యక్రమాల్లో ప్రైవేటు స్కూల్స్ పాల్గొనాలని కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొనే విద్యార్థులకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. జిల్లా స్థాయి ఇన్ స్పైర్ కు ఎంపికైన 119 మంది విద్యార్థులకు ప్రభుత్వం తరఫున రూ. పది వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడంతో పాటు, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామన్నారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఈవో అశోక్, సైన్స్ ఫెయిర్ అధికారి గంగా కిషన్, డీసీసీబీ డెలిగేట్ గంగశంకర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నాగేశ్వరరావు, ఎంఈవో నాగయ్యపాల్గొన్నారు.
చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం
నవీపేట్ : చదువుతో పాటు క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నాల్లేశ్వర్ గ్రామంలో జడ్పీహెచ్ఎస్లో మండల స్థాయి 69వ ఎస్జీఎఫ్ అంతర్ పాఠశాల క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాల్లేశ్వర్ స్కూల్లో చదివే నలుగు విద్యార్థులకు ట్రిపుల్‌ఐటీలో సీటు రావడం సంతోషకరమన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతి రెడ్డి రాజి రెడ్డి, ఎంఈవో సక్కి అశోక్, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు భూమయ్య, శివకుమార్ పాల్గొన్నారు.
