- ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి బోధన్‌లో బస్తీ దవాఖాన ప్రారంభం
బోధన్, వెలుగు : కార్పొరేట్స్థాయిలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు అందుతున్నాయని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని 32వ వార్డు పరిధిలో పాత చావిడి భవనంలో బస్తీ దవాఖానను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ప్రజా ఆరోగ్యమే పరమావధిగా కాంగ్రెస్ సర్కార్ పని చేస్తోందన్నారు. సర్కార్ దవాఖానల్లో సకల సౌకర్యాలను సమకూర్చుతుందన్నారు. బస్తీ దవాఖానను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కేంద్రంలో అన్ని రకాల వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించడంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని హితవు పలికారు.
రెసిడెన్షియల్ స్కూల్ కోసం స్థల పరిశీలన ..
బోధన్ పట్టణ శివారులోని బెల్లాల్ ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ల నిర్మాణానికి ఈ స్థలం అనువుగా ఉందని, త్వరలో పనులు ప్రారంభించాలని తెలిపారు. అంగన్వాడీ సెంటర్లలో
మెరుగైన సేవలు అందించాలి..
అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి సూచించారు. శుక్రవారం బోధన్ డివిజన్ లోని 113 అంగన్వాడీ కేంద్రాలకు దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ ఉచితంగా గ్యాస్ పొయ్యిలు అందజేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో బియ్యం, ఇతర సరుకులు భద్రపరచుకునేందుకు ప్లాస్టిక్ కంటైనర్లను స్థానిక నాయకుడు శరత్ అందించారు. బోధన్ పట్టణంలోని లయన్స్ భవన్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అంగన్వాడీ కేంద్రాల నిర్వహకులకు సామగ్రిని పంపిణీ చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
అంగన్వాడీ ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలని సూచించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ గడుగు గంగాధర్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, బోధన్ తహసీల్దార్ విఠల్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్‌రెడ్డి, బోధన్ సీడీపీవో డి.పద్మ తదితరులు పాల్గొన్నారు.
