
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, వెలుగు : ‘కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లో ఉండి సేవ చేయాలి.. కష్టపడే వారికే పదవులు దక్కుతాయి..’ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్లో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజా శ్రేయస్సు కోసమే అధిక టైం కేటాయించాలని, పదవుల కోసం పాకులాడవద్దన్నారు. కాంగ్రెస్ నాయకుల గెలుపునకు సైనికుల్లా పని చేశారని, అదే స్ఫూర్తితో కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. చిన్న చిన్న గొడవలు పక్కన బెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేలా కృషి చేయాలన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. గ్రామ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. స్టేట్‌లో రేవంత్‌రెడ్డి సర్కార్ చేపట్టిన కుల గణన సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు కె.మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు, స్టేట్ అగ్రో ఇండస్ర్టీస్ చైర్మన్ బాల్‌రాజు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, జిల్లా ఇన్చార్జీలు సత్యనారాయణగౌడ్, వేణుగోపాల్ యాదవ్, ఆయా మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.